LSG vs RR: లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్ కు చేరువలో రాజస్థాన్ రాయల్స్

LSG vs RR: లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్ కు చేరువలో రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు తిరుగులేకుండా పోతుంది. వరుస బెట్టి విజయాలు సాధిస్తున్న ఆ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై లక్నో సూపర్ జయింట్స్ కు షాకిస్తూ.. ఈ టోర్నీలో 8 వ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో రాజస్థాన్ ప్లే ఆఫ్ కు చేరువైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 199 పరుగులు చేసి గెలిచింది. 

 197 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ కు ఓపెనర్లు బట్లర్ (34), జైస్వాల్ (24) సూపర్ స్టార్ట్ ఇచ్చారు. తొలి వికెట్ కు 6 ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరి స్వల్ప వ్యవధిలో ఔటవ్వడం.. కాసేపటికే పరాగ్ (14) పెవిలియన్ కు చేరడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారి తీసింది. ఈ దశలో కెప్టెన్ సంజు శాంసన్ కు జత కలిసిన ధృవ్ జురెల్ జట్టును ముందుండి నడిపించారు. ఏ మాత్రం తడబడకుండా చివర వరకు బాధ్యతగా ఆడి మ్యాచ్ ను ఫినిష్ చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు అజేయంగా 121 పరుగులు జోడించడం విశేషం. 

సంజు శాంసన్ 33 బంతుల్లో 7 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 71 పరుగులు చేస్తే.. జురెల్ 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. వీరిద్దరి బ్యాటింగ్ ధాటికి లక్నో బౌలర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. లక్నో బౌలర్లలో అమిత్ మిశ్రా,స్తోయినీస్,యాష్ ఠాకూర్ తలో వికెట్ తీసుకున్నారు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(76), దీపక్ హుడా(50)లు అర్థ శతకాలతో చెలరేగి  జట్టును ఆదుకున్నారు.