RR vs GT: సూర్యవంశీ ధాటికి కుదేలైన గుజరాత్.. సెంచరీతో రాజస్థాన్‌ను ఒంటి చేత్తో గెలిపించిన 14 ఏళ్ళ కుర్రాడు

RR vs GT: సూర్యవంశీ ధాటికి కుదేలైన గుజరాత్.. సెంచరీతో రాజస్థాన్‌ను ఒంటి చేత్తో గెలిపించిన 14 ఏళ్ళ కుర్రాడు

ఐపీఎల్ 2025 లో రాజస్థాన్ రాయల్స్ చాలా మ్యాచ్ ల తర్వాత జూలు విదిల్చింది. గత మూడు మ్యాచ్ ల్లో చేజింగ్ దగ్గరకు వచ్చి ఓడిపోతున్న రాజస్థాన్.. సోమవారం (ఏప్రిల్ 28) గుజరాత్ టైటాన్స్ పై 210 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేజ్ చేసి సంచలన విజయాన్ని అందుకుంది. 14 ఏళ్ళ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 101: 7 ఫోర్లు, 11 సిక్సులు) ఓపెనర్ గా పెను విధ్వంసం సృష్టించడంతో కొండంత స్కోర్ కూడా కరిగిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 15.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసి గెలిచింది.    

210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. సిరాజ్ బౌలింగ్ లో సిక్సర్ ను కొట్టి దూకుడు ప్రదర్శించిన వైభవ్.. ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించాడు. మూడో ఓవర్ లో జైశ్వాల్ మూడు బౌండరీలు కొడితే.. ఇషాంత్ శర్మ వేసిన నాలుగో ఓవర్లో వైభవ్ సూర్యవంశీ ఏకంగా 28 పరుగులు రాబట్టి విధ్వంసం సృష్టించాడు. దీంతో తొలి నాలుగు ఓవర్లలోనే 60 పరుగులు చేసిన రాజస్థాన్.. పవర్ ప్లే లో ఏకంగా 87 పరుగులు రాబట్టింది. 

ఈ క్రమంలో వైభవ్ 17 బంతుల్లోనే ఐపీఎల్ లో తన తొలి హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. మరో ఎండ్ లో జైశ్వాల్ కూడా కుదిరినప్పుడు బౌండరీలు బాదుతూ స్కోర్ వేగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకరించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మరింత రెచ్చిపోయి ఆడిన ఈ 14 ఏళ్ళ కుర్రాడు.. కరీం జనతా వేసిన 10 ఓవర్లో ఏకంగా 30 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. 

35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని పలు రికార్డులు తిరగరాశాడు. దీంతో తొలి 10 ఓవర్లలోనే రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 144 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. సెంచరీ తర్వాత ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో బౌల్డవ్వడంతో అతని గొప్ప ఇన్నింగ్స్ కు తెరపడింది. ఆ తర్వాత వెంటనే రాణా ఔటైనా మరో ఓపెనర్ జైశ్వాల్(40 బంతుల్లో 70: 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్ పరాగ్( 15 బంతుల్లో 32: 2 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.   

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది.  ఈ సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ (84), సాయి సుదర్శన్(39), బట్లర్ (50) మరోసారి మెరిశారు. ఈ త్రయం అదరగొట్టడడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ గిల్ (50 బంతుల్లో 84:5 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో తీక్షణ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆర్చర్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.