రాజస్థాన్లో విషాదం జరిగింది. బార్మర్ కు చెందిన ఇద్దరు కవల సోదరులు పుట్టుకలోనే కాదు..చావులోనూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. కొన్ని గంటల వ్యవధిలోనే 26 ఏండ్ల కవలలు మృత్యు ఒడికి చేరిపోయారు. సుమేర్, సోహన్ సింగ్ లు రెండు వేర్వేరు రాష్ట్రాల్లో దాదాపు 900 కిలోమీటర్ల దూరంలో జీవిస్తు్న్నారు. ఒకరి మరణ వార్తను మరొకరు తట్టుకోలేక ఇద్దరు సోదరులు విచిత్రమైన పరిస్థితులలో మరణించారు. ఒకరు గుజరాత్ లోని సూరత్ లో ఉన్న ఇంటి టెర్రస్ పై నుంచి కింద చనిపోయాడు. మరొకరు జైపూర్ లో ప్రమాదవశాత్తూ వాటర్ ట్యాంకులో పడి చనిపోయాడు.
అయితే కవలల్లో పెద్దవాడైన సోహన్.. సోదరుడి మరణ వార్త తెలిసిన తరువాత తన గ్రామానికి 100 మీటర్ల దూరంలో ఉన్న చెరువుకు సమీపంలో ఉన్న ట్యాంకు నుంచి నీరు తీసుకురావడానికి బయటకు వెళ్లాడు. కానీ తిరిగి రాలేదు. ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు దగ్గరకు వెళ్లారు. అయితే ఆ సమయంలో సోహన్ నీటిలో పడి ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించి మరణించాడు.అయితే సోహన్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనలో మరణించిన సోదరులు సుమేర్, సోహన్ సింగ్ లు బార్మర్ జిల్లాలోని సర్నో కా తలా కవలలుగా జన్మించారు. సోదరుల్లో ఒకరైన సుమేర్ గుజరాత్ లోని టెక్స్ టైల్ సిటీలో పనిచేస్తుండగా, సోహన్ జైపూర్ లో గ్రేడ్ 2 టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ కు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు కుమారులు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఇద్దరికి ఒకే చితిపై అంత్యక్రియలు నిర్వహించారు.