నలుగురు పిల్లలను స్టీలు డ్రమ్ములో పెట్టి.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి

రాజస్థాన్ లో ఓ మహిళ, తన నలుగురు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకరమైన ఘటన బార్మన్ జిల్లాలోని బనియావాస్ లో చోటుచేసుకుంది. ఊర్మిళ, జెతారామ్ అనే దంపతులకు భావన(8), విక్రమ్ (5), విమల(3), మనీషా(2) అనే నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే భార్యాభర్తలిద్దరూ నిత్యం గొడవపడుతూ ఉండే వారని సమాచారం. ఈ క్రమంలోనే వారు మరోసారి గొడవపడ్డారు. భర్త జెతారామ్ రోజూ లాగే జోద్ పూర్ కు పనికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత భార్య ఊర్మిళ తన నలుగురు పిల్లలను ఓ స్టీలు డ్రమ్ములో పెట్టింది. ఆ తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

స్టీలు డ్రమ్ములో పిల్లల్ని పెట్టడంతో వారు ఊపిరాడక చనిపోయారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు మండలి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కమలేష్ గెహ్లాట్ తెలిపారు. మృతురాలి భర్త మైనింగ్ కార్మికుడని, ఉద్యోగం కోసం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల గురించి ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించగా విషయం వెలుగులోకి వచ్చింది.

భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, అదే హత్యకు కారణమని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపామని, అధికారిక ఫిర్యాదు కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.