ప్రాణహిత చేవెళ్లను.. తుమ్మిడిహెట్టి దగ్గరే ఆపేశారు: రజత్ కుమార్

ప్రాణహిత చేవెళ్లను.. తుమ్మిడిహెట్టి దగ్గరే ఆపేశారు: రజత్ కుమార్

కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని, అది పూర్తయి ఆదాయం జనరేట్​ అయ్యేదాకా.. ప్రాజెక్టుకు సంబంధించిన అప్పుల అసలు, వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే కట్టాల్సి ఉంటుందని ఇరిగేషన్​ శాఖ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, రిటైర్డ్​ ఐఏఎస్​ రజత్​ కుమార్​ స్పష్టం చేశారు.  ప్రాజెక్టు పూర్తయ్యాక ఇండస్ట్రీల అవసరాలు, తాగునీటి అవసరాలు, చేపల పెంపకం వంటి వాటి ద్వారా ఆదాయం సమకూరుతుందని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ నిర్వహిస్తున్న ఓపెన్​ కోర్టు విచారణకు బుధవారం రజత్​కుమార్​తో పాటు రిటైర్డ్​ సీఎస్​ శైలేంద్ర కుమార్​ జోషి హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 2015 మార్చిలో అప్పటి సీఎం (కేసీఆర్​) అసెంబ్లీలో పవర్​పాయింట్​ ప్రెజెంటేషన్​ ఇచ్చారని, ఆ మరుసటి ఏడాదే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారని విచారణలో రజత్​ కుమార్​ వెల్లడించారు.

తుమ్మిడిహెట్టి వద్ద పూర్తిగా ఆపేశారు

తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించ తలపెట్టిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయిందని, అందుకే వేరే స్థలంలో ప్రాజెక్టును రీడిజైన్​ చేశారని రజత్​ కుమార్​ వెల్లడించారు. తుమ్మిడిహెట్టితో మహారాష్ట్రలో 3 వేల ఎకరాల భూమి ముంపుకు గురవుతుండడం వల్లే మేడిగడ్డకు బ్యారేజీని షిఫ్ట్​ చేయాల్సి వచ్చిందన్నారు. బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయకూడదు కదా.. అలాంటప్పుడు ఎందుకు నిల్వ చేశారని కమిషన్​ ప్రశ్నించింది. మేడిగడ్డ బ్యారేజీని కట్టింది నీటిని నిల్వ చేసేందుకు కాదని.. ఓ టైం వరకు నీటిని స్టోర్​ చేసి వెంటనే ఎత్తిపోసుకునేందుకు వీలుగా డిజైన్​ చేశారని రజత్​ స్పష్టం చేశారు.

Also Read :- ధరణి తప్పులకు భూ భారతితో చెక్

 తాను సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నప్పటికే బ్యారేజీలను ప్రారంభించారన్నారు. అయితే, తాను ఉన్నప్పుడు బ్యారేజీ మూడు వరదలను తట్టుకుని నిలబడిందని చెప్పారు. 2019, 2020, 2022 వరదలనూ తట్టుకుందన్నారు. అయితే, బ్యారేజీ ప్రారంభమయ్యాక తొలిసారి వచ్చిన వరదలకు ముందున్న సీసీ బ్లాకులు డ్యామేజ్​ అయ్యాయని, వాటిపై స్టడీ చేసి రిపేర్లు చేయాల్సిందిగా సంబంధిత ప్రాజెక్టు అధికారులకు చెప్పామని వివరించారు. నీటిని విడుదల చేశాక దిగువకు వెళ్లే వరద ప్రవాహ వేగం ఎక్స్​పెక్ట్​ చేసిన దాని కన్నా ఎక్కువ ఉండడం వల్లే ఆ సమస్య తలెత్తిందని అధికారులు చెప్పారని ఆయన తెలిపారు.