IPL 2025: టార్గెట్ అదిరింది: ప్లే ఆఫ్స్, టైటిల్ కాదు.. మా ప్రధాన లక్ష్యం అదే: RCB కెప్టెన్

IPL 2025: టార్గెట్ అదిరింది: ప్లే ఆఫ్స్, టైటిల్ కాదు.. మా ప్రధాన లక్ష్యం అదే: RCB కెప్టెన్

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తిరుగులేకుండా పోతుంది. రజత్ పటిదార్ కెప్టెన్సీలోని ఆర్సీబీ జట్టు ఈ సీజన్ లో  కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది. ఆదివారం (ఏప్రిల్ 27) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ఈ సీజన్ లో హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. తొలి 7 మ్యాచ్ ల్లో నాలుగు మ్యాచ్ లు గెలిచిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుసగా మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం 10 మ్యాచ్ ల్లో 7 విజయాలు సాధించిన బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ కు చేరువలో ఉంది. ఈ దశలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ తమ లక్ష్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. 

ఆదివారం (ఏప్రిల్ 27) ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత తమ తదుపరి లక్ష్యం గురించి మాట్లాడాడు. జట్టు ప్రస్తుతం ప్లే ఆఫ్స్ క్వాలిఫికేషన్ గురించి ఆలోచించడం లేదని.. తమ ప్రధాన లక్ష్యమంతా టాప్ 2 పైనే ఉందని చెప్పాడు. పటిదార్ మాటలను బట్టి చూస్తుంటే ఆర్సీబీ జట్టు ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో అర్ధమవుతుంది. ఈ సీజన్ లో ఆర్సీబీ మరో నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇందులో భాగంగా తమ తదుపరి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో శనివారం (మే 3) తలబడుతుంది. వీటిలో 3 గెలిచినా టాప్ 2 లో ఎంట్రీ ఇస్తుంది. టాప్ 2 లో ఉన్న జట్లకు ఫైనల్ కు వెళ్లాలంటే రెండు అవకాశాలు ఉంటాయని తెలిసిందే. 

టాప్-2 లో అర్హత సాధించిన జట్లు మొదట క్వాలిఫయర్ 1 ఆడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. ఒకవేళ ఓడిపోయినా ఇంకో ఛాన్స్ ఉంటుంది. ఎలిమినేటర్ లో ఓడిపోయిన జట్టుతో క్వాలిఫయర్ 2 లో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్ కు చేరుతుంది. ప్రస్తుతం టాప్ 2 లో ఉండడం అంత తేలిక కాదు. బెంగళూరుతో పాటు ముంబై, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టాప్-2 లో చేరే అవకాశం ఉంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ లు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆడాల్సి ఉంది.