Ranji Trophy 2024: కోట్లు కొల్లగొట్టే సమయం: 68 బంతుల్లోనే RCB స్టార్ సెంచరీ

Ranji Trophy 2024: కోట్లు కొల్లగొట్టే సమయం: 68 బంతుల్లోనే RCB స్టార్ సెంచరీ

రాయల్ ఛాలెంజర్స్ స్టార్ బ్యాటర్ రజత్ పటిదార్ మెరుపు సెంచరీతో అలరించాడు. కేవలం 68 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకోవడం విశేషం. రంజీ ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్ తరపున ఆడుతున్న ఈ 30 ఏళ్ళ బ్యాటర్ మంగళవారం (అక్టోబర్ 29) ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో.. హర్యానాతో జరిగిన మ్యాచ్ లో ఈ ఫీట్ నమోదు చేశాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది ఐదో ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. ఓవరాల్ గా పంత్ 48 బంతుల్లో సెంచరీ కొట్టి అగ్ర స్థానంలో ఉన్నాడు.  

ఈ మ్యాచ్ లో మొత్తం 102 బంతుల్లో 157 పరుగులు చేసి ఔటయ్యాడు. పటిదార్ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. పటిదార్  ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇది 13వ సెంచరీ కావడం విశేషం. పటిదార్ దూకుడు ముందు హర్యానా బౌలర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది.   మ్యాచ్ మొత్తం దూకుడుగానే ఆడి ఐపీఎల్ కు ముందు తన జట్టు  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు  ఛాలెంజ్ విసిరాడు. 2024 ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన ఈ 30 ఏళ్ళ ఆటగాడిని ఆర్సీబీ రిటైన్ చేసుకోవడం అనుమానంగా మారింది. అయితే సెంచరీతో ఒక్కసారిగా రేస్ లోకి వచ్చాడు.   

ఆర్సీబీతో భారత టెస్టు సెలక్టర్లకు పటిదార్ పని పెట్టాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం చివరి మూడు టెస్టులకు అతడిని ఎంపిక చేస్తారేమో చూడాలి. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్ పై ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత జట్టులో అరంగేట్రం చేశాడు. అయితే వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమై జట్టులో నుంచి స్థానం కోల్పోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో పటిదార్ ఆరు ఇన్నింగ్స్‌ల్లో 63 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆస్ట్రేలియాలో గురువారం నుంచి రెండు మ్యాచ్‌లు ఆడనున్న ఇండియా ఏ  జట్టులో కూడా అతనికి చోటు దక్కలేదు.