IPL 2024: లక్కంటే ఆర్‌సీబీ ప్లేయర్‌‌దే.. ఐపీఎల్ ప్రైస్‌కు రూ. 30 లక్షలు అదనం

IPL 2024: లక్కంటే ఆర్‌సీబీ ప్లేయర్‌‌దే.. ఐపీఎల్ ప్రైస్‌కు రూ. 30 లక్షలు అదనం

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఆర్‌సీబీ ఆటగాడు రజిత్ పటిదార్ నేడు ద‌క్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వ‌న్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. కెరీర్ లో తొలి మ్యాచ్‌ ఆడుతున్నా.. అతనిలో ఏమాత్రం తడబాటులేదు. దూకుడుగా ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే ఈ యువ బ్యాటర్ ఈ మ్యాచ్ ద్వారా మ‌రో జాక్‌పాట్ కొట్టాడు. వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్‌లో ఏకంగా రూ. 30 ల‌క్షలు అద‌నంగా ఆర్జించ‌నున్నాడు. పటిదార్‌ ఐపీఎల్ ధర రూ.20 లక్షలు అయినా ఆర్‌సీబీ యాజ‌మాన్యం అతనికి రూ.50 లక్షలు ముట్టజెప్ప‌నుంది.

రూ.50 లక్ష‌లు ఇవ్వాల్సిందే

ఏదేని ఆటగాడు ఐపీఎల్ సీజ‌న్ల మ‌ధ్య‌లో భార‌త జ‌ట్టుకు ఆడినట్లయితే సదరు క్రికెటర్ కు క‌నీసం రూ.50 లక్ష‌లు ఇవ్వాల‌నేది బీసీసీఐ నిబంధన.  అందులో భాగంగానే పటిదార్‌ వచ్చే సీజన్ లో రూ.50 లక్షలు అందుకోనున్నాడు.

బీసీసీఐ ఫీజు నిబంధనలు ఇవే!

ఐపీఎల్ సీజన్ల మధ్య ఏదేని ఆటగాడు భార‌త జ‌ట్టుకు ఆడినట్లయితే (క్యాప్డ్ ప్లేయర్‌) అతని కనీస ఫీజు రూ. 50 లక్షలుగా ఉండాలి. ఒకటి నుంచి నాలుగు మ్యాచ్‍లు ఆడితే రూ. 50 లక్షలు చెల్లించాలి. అదే 4 నుంచి 8 మ్యాచ్‍లు ఆడితే రూ. 75 లక్షలు, అంతకంటే ఎక్కువ ఆడినట్లయితే కోటి రూపాయలు చెల్లించాలి.

ఐపీఎల్ 2022 సీజన్ లో లువ్‌నిత్ సిసోడియా స్థానంలో రూ. 20 లక్షల కనీస ధరకు జట్టులోకి వచ్చిన పటిదార్, ఆ ఏడాది పర్వాలేదనిపించాడు. 8 మ్యాచుల్లో 55.50 స‌గుటుతో 333 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. అయితే గతేడాది  సీజ‌న్‌కు ముందు అతడు గాయప‌డటంతో టోర్నీ మొత్తానికి దూర‌మ‌య్యాడు. ఈ మ‌ధ్యే గాయం నుంచి కోలుకున్న పటిదార్ ద‌క్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌కు ఎంపిక‌య్యాడు.