కుర్రాళ్లతో దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా వన్డే సిరీస్ లో నేడు చివరి వన్డే ఆడనుంది. మొదటి వన్డేలో సఫారీలను చిత్తు చేసి భారీ విజయాన్ని అందుకున్న భారత్ రెండో వన్డేలో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. ఈనేపధ్యంలో నేడు (డిసెంబర్ 21) బోలాండ్ పార్క్ లో దక్షిణాఫ్రికాను ఓడించి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ గట్టి పట్టుదలగా ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా రెండో వన్డేలో ఫామ్ కొనసాగించి సొంతగడ్డపై సిరీస్ దక్కించుకోవాలని భావిస్తుంది. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో సిరీస్ ఎవరు గెలుస్తారో ఆసక్తికరంగా మారింది.
పటిదార్ ఎంట్రీ ఖాయం
సిరీస్ కు కీలకంగా మారిన ఈ మ్యాచ్ లో భారత తుది జట్టులో మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నిరాశపర్చిన రుతురాజ్ గైక్వాడ్, తెలుగు బ్యాటర్ తిలక్ వర్మలో ఒకర్ని తప్పించి రజత్ పటీదార్‌ను తీసుకునే యోచన చేస్తున్నారు. ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున ఆడిన పటిదార్ అందరికీ సుపరిచితమే. ఇటీవలే గాయం నుంచి కోలుకొని విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా టీమిండియా వన్డే జట్టులో ఎంపికైన పటిదార్.. నేడు అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
మధ్యప్రదేశ్ తరఫున నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తుండటం రజత్‌కు కలిసి వచ్చింది. శ్రేయస్ అయ్యర్ టెస్టు స్క్వాడ్ లో చేరడంతో బ్యాటింగ్ భారం యువ ప్లేయర్ సాయి సుదర్శన్, కెప్టెన్ కేఎల్ రాహుల్‌పైనే పడింది. వచ్చిన అవకాశాలను సంజూ శాంసన్ వినియోగించుకోలేకపోవడం ఇండియాకు ప్రతికూలాంశం. ఈ ఒక్క మార్పు మినహాయిస్తే రెండో వన్డే జట్టునే కొనసాగించవచ్చు.
బౌలర్లు గాడిలో పడతారా..?
బోలాండ్ పార్క్ వికెట్‌పై మంచి బౌన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో బ్యాటర్లు చెలరేగితే భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌లోనూ ఇండియాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేసర్ ముకేశ్ కుమార్ ఇంత వరకు ఖాతా తెరవలేదు. తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్న అర్ష్‌దీప్, అవేశ్ ఖాన్ రెండో వన్డేలో ఫెయిలయ్యారు. కాబట్టి ముకేశ్‌తో పాటు ఈ ఇద్దరూ కూడా గాడిలో పడితే సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకు పరిమితం చేయొచ్చు. చాహల్ కు మరోసారి నిరాశ తప్పకపోవచ్చు.