గాంధీభవన్​కు చేరిన  రాజీవ్​జ్యోతియాత్ర

గాంధీభవన్​కు చేరిన  రాజీవ్​జ్యోతియాత్ర
  • టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి 

హైదరాబాద్:   మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది చేపట్టే 'రాజీవ్ జ్యోతి యాత్ర'   ఇవాళ   నాంపల్లిలోని గాంధీభవన్​కు  చేరుకుంది.  గాంధీభవన్​లో యాత్రకు టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్​ కుమార్​ యాదవ్, రాష్ట్ర​ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్​ మెట్టు సాయికుమార్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు  తదితరులు పాల్గొని  యాత్రకు సంబంధించిన  జ్యోతిని అందుకొని ఘన స్వాగతం పలికారు.  ఈనెల 8న తమిళనాడులో ప్రారంభమైన యాత్ర రాజీవ్ జయంతి రోజైన ఈనెల 20న దిల్లీ చేరుకుంటుంది.

 తమిళనాడు కాంగ్రెస్ నాయకుడు సామ్యేల్ ఆధ్వర్యంలో ఈ యాత్ర దేశవ్యాప్తంగా కొనసాగుతుంది.  నిజామాబాద్, ఆదిలాబాద్ నాగ్​పూర్​  మీదగా ఈనెల 20 వరకు ఈ యాత్ర దిల్లీ చేరుకోనున్నది. 20 సాయంత్రం ఢిల్లీలో రాజీవ్ వీర్ భూమి దగ్గర సోనియా గాంధీ, రాహుల్ గాంధీ  యాత్ర జ్యోతిని అందజేయనున్నారు.  ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి మాట్లాడుతూ.. దేశ మాజీ ప్రధాని  రాజీవ్ గాంధీ పుట్టిన రోజు  సందర్భంగా ప్రతి ఏటా పెరంబుదూర్ నుండి ఢిల్లీ వరకు ఈ జ్యోతి యాత్ర జరుగుతుందన్నారు.  దేశం కోసం ప్రాణాలు ఆర్పించిన గొప్ప వ్యక్తి  రాజీవ్​ గాంధీ  అని కొనియాడారు.   

రాజీవ్​ గాంధీ  చొరవతోనే మనందరికీ  18 ఏండ్లకు ఓటు హక్కు కలిగిందన్నారు.  రాజీవ్​ హయాంలో దేశంలో మహిళల కోసం ప్రత్యేకమైన స్కీమ్ లను అమలు చేయడంతో పాటు, పంచాయతీరాజ్​ చట్టాన్ని రూపొందించారని తెలిపారు.  రాష్ట్రంలో అద్భుతంగా ప్రజాపాలన కొనసాగుతుందన్నారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత  అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.