రాజీవ్‍ యువ వికాసం పరేషాన్!

రాజీవ్‍ యువ వికాసం పరేషాన్!
  • క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్‍, పాన్‍, రేషన్‍ కార్డులు మస్ట్
  • పదేండ్లుగా పాత రేషన్‍ కార్డుల్లేవ్.. కొత్తవి ఇంకా ఇవ్వలే 
  • సర్టిఫికెట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న జనాలు 
  • వేలల్లో దరఖాస్తులు వస్తుండగా జారీలో అధికారులు లేట్  
  • త్వరగా ఇచ్చేందుకు చేతివాటం చూపుతున్న సిబ్బంది 
  • ఏప్రిల్‍ 5 చివరి తేదీ కావడంతో అర్హుల్లో ఆందోళన

వరంగల్‍, వెలుగు: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ‘ రాజీవ్‍ యువ వికాసం’ స్కీమ్ పరేషాన్ చేస్తుంది. అర్హులైన యువత దరఖాస్తు చేసుకునేందుకు క్యాస్ట్, లేటెస్ట్ ఇన్ కమ్ సర్టిఫికెట్లతో పాటు పాన్‍, రేషన్‍ కార్డ్​మస్ట్ గా అడుగుతుండగా ఆఫీసు ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. చాలామందికి రేషన్​కార్డులు లేక పోవడం, పదేండ్లలో కొత్తవి ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కీమ్ అప్లై గడువు ఏప్రిల్‍ 5 తేదీ కావడంతో సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకు తిప్పలు పడుతున్నారు. 

నిరుద్యోగ యువతకు వరమే

ముఖ్యమంత్రి రేవంత్‍రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ  స్కీమ్ నిరుద్యోగ యువతకు వరంగానే ఉంది. వ్యవసాయ, పశుపోషణ వంటివే కాకుండా..టిఫిన్‍ సెంటర్‍ నుంచి టీవీ మెకానిక్‍ షాప్ వరకు .. కూల్‍ డ్రింక్‍ షాప్‍ నుంచి కూలర్ల బిజినెస్ వరకు..ఆటో మొబైల్‍ షాపు నుంచి మినీ సూపర్‍ బజార్‍ బిజినెస్‍ వరకు యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. పల్లె, పట్నమనే తేడా లేకుండా దాదాపు75 రకాల బిజినెస్ లకు లోన్లు అందిస్తారు. దీంతో రాష్ట్రంలోని అర్హులైన 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్కీమ్ ద్వారా ఎంతో మేలు కలగనుంది.  రూ.లక్ష నుంచి 4 లక్షల వరకు లోన్‍లో అందించే యూనిట్లకు 80 శాతం దాకా సబ్సిడీగా అందిస్తుంది. 

ఆఫీసుల్లో సిబ్బంది చేతివాటం

స్కీమ్ కు  కావాల్సిన సర్టిఫికెట్లు లేనివారు తెచ్చుకునేందుకు ఆఫీసులకు క్యూ కడుతున్నారు. దీంతో ఒక్కో మండలంలో వేలల్లో దరఖాస్తులు ఉంటున్నాయి. రెవెన్యూ అధికారులు జారీ చేసేందుకు  కిందిస్థాయి సిబ్బంది ఎంక్వైరీతో పాటు ముగ్గురు, నలుగురు అధికారుల సంతకాలు కావడంతో నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోవైపు రెవెన్యూ సిబ్బంది కొరత, పని ఒత్తిడి పేరుతో సర్టిఫికెట్ల జారీలో లేట్ చేస్తున్నారు.  

ఇదే అదనుగా ఆఫీసుల్లో కొందరు కిందిస్థాయి సిబ్బంది త్వరగా సర్టిఫికెట్ల మంజూరు చేసేందుకు చేతివాటం చూపుతున్నారు. అప్లికేషన్‍ ప్రాసెస్‍ చేసే క్రమంలో కొన్ని పత్రాలు లేకున్నా అఫిడవిట్‍ ద్వారా తీసుకునే చాన్స్ ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదు. పాన్‍ కార్డు మస్ట్ కావడం, లోకల్‍గా ఇచ్చేది కాకపోవడంతో అర్హులకు సైతం స్కీమ్ సరిగా అందని పరిస్థితి ఉంది. 

రేషన్‍ కార్డు​, సబ్సిడీ లోన్‍ లింక్‍తో ఇబ్బందులు 

అర్హుల ఎంపికకు రేషన్‍ కార్డు మస్ట్ గా పెట్టడడంతో తలనొప్పిగా మారింది. గత సర్కార్ కొత్త కార్డులు ఇవ్వలేదు. కాంగ్రెస్‍ ప్రభుత్వం ఇంకా పంపిణీ చేయలేదు. దీంతో లక్షలాది మందికి ఇబ్బందిగా మారింది. మరోవైపు కొత్త రేషన్‍ కార్డులు వస్తాయనే సమాచారంతో  పెండ్లికి ముందు తల్లిదండ్రులతో దిగిన కార్డును రద్దు చేసుకోగా.. ఇప్పుడు పాతది, కొత్తది రెండూ లేకపోగా ఇబ్బందులు వచ్చిపడ్డాయి. 

మరోవైపు గ్రామాల్లో ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ఒక్కరికే  స్కీమ్ వర్తించేలా నిబంధన పెట్టారు. దీంతో ఇంట్లో మొదట అప్లై చేసుకునేవారి పేరు మాత్రమే తీసుకుంటోంది. గతంలో సబ్సిడీ లోన్‍ తీసుకున్నవారి పేర్లు సైతం ఆన్‍లైన్‍లో తీసుకోవడంలేదు. కుటుంబంలో నలుగురైదుగురు ఉన్నచోట ఒకరు లోన్‍ తీసుకుని ఉండడం,  ఆ కారణంచేత ఇప్పుడు కొత్త స్కీమ్ వర్తించడంలేదు.