పండుగ వాతావరణంలో ఎన్నికలు

పండుగ వాతావరణంలో ఎన్నికలు

వికారాబాద్, వెలుగు:  జిల్లాలో నిష్పక్షపాతంగా పండుగ వాతావరణంలో లోక్ సభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకుడు రాజేంద్ర కుమార్ కటారియా అన్నారు. ఆదివారం వికారాబాద్ లోని సంగం లక్ష్మి  బాయి హైస్కూల్ లో 137 – 140, సిద్దులుర్ లో 122, 123 పోలింగ్ స్టేషన్లను ఆయన పరిశీలించారు. అనంతరం మేరీ ఏ నాట్స్ స్కూల్ లో ఈవీఎంల పంపిణీ, రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూము తనిఖీ చేశారు. 

ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎంత మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని సంబంధిత అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కంట్రోల్ రూమ్, సువిధ, సీ విజిల్,  మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ కేంద్రం తదితర విభాగాలను  పరిశీలించారు. జడ్పీసీఈఓ సుధీర్, డీఆర్డీఏ శ్రీనివాస్, డీపీఆర్ఓ చెన్నమ్మ , ఎన్నికల  విభాగం  సుపరింటెండెంట్  శ్రీనివాస్,  తహసీల్దారు లక్ష్మి నారాయణ 
 పాల్గొన్నారు. 

తాండూరు: తాండూరు నియోజకవర్గంలో కలెక్టర్ నారాయణ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి లతో రాజేంద్ర కుమార్ కటారియా పర్యటించారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను, ఫెసిలిటేషన్ కేంద్రంలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని పరిశీలించారు.  కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్లు తారా సింగ్, కిషన్ పాల్గొన్నారు.