
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఇటీవల భారీగా కోడి పందేలు జరిగిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనలో పోలీసులు 64 మందిని అరెస్ట్ చేయగా 84 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు . అయితే ఈ కోళ్లను వేలం వేయగా భారీ రేటు పలికాయి. 10 కోళ్లు 3 లక్షల 75 వేలకు పలికి రికార్డ్ ధరకు అమ్ముడుపోయాయి.
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పట్టుపడ్డ కోళ్లను ఫిబ్రవరి 17న రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్ట్ వేలం వేసింది. 16 మంది అడ్వకేట్ల సమక్షంలో వేలం పాట జరిగింది. 57 మంది వేలం పాటలో పాల్గొన్నారు.10 కోళ్లు కలిపి ఓక స్లాట్ గా వేలం వేశారు. మొదటి 10 కోళ్లకు వేలం వేయగా.. సర్కార్ వారీ పాట 15 వేలతో మొదలై రెండున్నర లక్షలకు దక్కించుకున్నారు. 10 కోళ్లను శ్రీనివాస్ అనే వ్యక్తి రెండున్నర లక్షలకు కొనుగోలు చేశాడు. ఇక రెండో స్లాట్ లో వేలం వేసిన 10 కోళ్లు రూ. 3,75,000 లకు అమ్ముడుపోయాయి. వేలం పాటలో కోళ్లు దక్కించుకున్న వారు 10 నిమిషాల్లో డబ్బును కోర్టులో కట్టాలి.
ఫిబ్రవరి 11న రాత్రి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్ట గ్రామ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ లో భారీ ఎత్తున కోడి పందేలు జరిగాయి. ఏపీకి చెందిన నిర్వాహకుడు శివకుమార్, పందెం రాయుళ్లను చుట్టుముట్టి మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. 84 పందెం కోళ్లు, రూ.30 లక్షల క్యాష్, 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 64 మందిని మొయినాబాద్ పీఎస్కు తరలించారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి కూడా పోలీసులు నోటీసులిచ్చారు.