
సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజ్ మాదిరాజు రూపొందించిన చిత్రం ‘కృష్ణారామా’. అనన్య శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, చరణ్ లక్కరాజు, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించారు. ‘ఈటీవీ విన్’ ఓటీటీ ద్వారా అక్టోబర్ 22 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘ఓటీటీ వచ్చాక ఇప్పుడు సినిమాలు నేరుగా ఇంటికి వచ్చేస్తున్నాయి. నేను నటించిన ఓటీటీ సినిమా ‘సేనాపతి’కి ముంబైలో బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ వచ్చింది. ఇప్పుడు ఈ ‘కృష్ణారామా’ చాలా ప్రత్యేకమైన చిత్రం. రాజ్ కథ చెప్పినపుడు చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది.
ఇప్పటి జనరేషన్‌కి తగిన కథ ఇది. అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని చెప్పారు. గౌతమి మాట్లాడుతూ ‘ఇది చాలా యూనిక్, స్పెషల్ ప్రాజెక్ట్. అలాగే మోడర్న్ సబ్జెక్ట్ కూడా. నా ఫస్ట్ హీరో రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేయడం హ్యాపీ. తప్పకుండా అందరినీ అలరిస్తుంది’ అన్నారు. ఇదొక రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పాడు దర్శకుడు రాజ్. అనన్య శర్మతో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు.