కాంగ్రెస్​లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

కాంగ్రెస్​లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
  • సీఎం రేవంత్ సమక్షంలో చేరిక
  • నేడు మరో ఎమ్యెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు జాయిన్​ అయ్యే అవకాశం

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్​కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు వరుస షాక్​లు ఇస్తున్నారు. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్  కారు దిగి కాంగ్రెస్​లో చేరారు. శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో ప్రకాశ్ గౌడ్​కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశ్​ చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది. గతంలోనే ప్రకాశ్ గౌడ్ సీఎంను కలిసి పార్టీలో చేరికపై చర్చించారు.

అప్పట్లోనే ఆయన పార్టీ మారుతారని ప్రచారం సాగింది. చివరకు ఆయన శుక్రవారం తిరుపతికి వెళ్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడే తన పార్టీ మార్పుపై ప్రకటన చేశారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న ప్రకాశ్ గౌడ్.. సీఎం రేవంత్ ఇంటికి వెళ్లి కాంగ్రెస్ గూటికి చేరారు. అదే బాటలో మరికొందరుప్రకాశ్​గౌడ్​బాటలోనే మరి కొందరు బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్టు తెలిసింది.

శుక్రవారం అరికపూడి గాంధీ ఇంట్లో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, మరో ఎమ్మెల్సీ సమావేశమయ్యారు. శనివారం వారు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నట్టు గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అలాగే, అరికపూడి గాంధీతో పాటు ముగ్గురు బీఆర్ఎస్​ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో​చేరుతున్నట్టు తెలిసింది.