గ్రేటర్ హైదరాబాద్ లో నకిలీ చాక్లెట్ల తయారీ..

  • సిటీలో నకిలీ చాక్లెట్ల తయారీ
  • రెండేండ్లుగా కొనసాగుతున్న దందా
  • నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

గండిపేట, వెలుగు : హైదరాబాద్ ​సిటీలో నకిలీ చాక్లెట్లు తయారు చేస్తున్న వ్యక్తిని రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిర్వాహకుడితో పాటు అక్కడ పనిచేస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. సులేమాన్‌‌నగర్​కు చెందిన అహ్మద్‌‌(30) రెండేండ్ల క్రితం అదే ప్రాంతంలో ఎంకే స్వీట్స్‌‌ పేరిట చిన్న షెడ్​లో పరిశ్రమను ఏర్పాటు చేశాడు. అందులో వివిధ పేర్లతో సిట్రిక్‌‌ యాసిడ్‌‌ పౌడర్, చక్కెర, ఇతర కెమికల్స్​తో నకిలీ చాక్లెట్లు, లాలీపాప్స్, పిప్పరమెంట్స్‌‌ తయారు చేసి.. వాటిని అందంగా ప్యాక్ ​చేసి బేగంబజార్‌‌లోని హోల్‌‌సేల్‌‌ వ్యాపారులకు విక్రయిస్తున్నాడు.

ఓ షెడ్​లో ఈగలు, దోమలు, పురుగులు పడిన పానకంతోనే వాటిని తయారు చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్వోటీ పోలీసులు బుధవారం ఆ పరిశ్రమపై దాడి చేసి అహ్మద్​తో పాటు అక్కడ పనిచేస్తున్న కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. 350 కిలోల చెక్కర, రసాయనాల బాటిళ్లు, రంగు డబ్బాలు, ఒక డ్రమ్ము గ్లూకోజ్‌‌ లిక్విడ్, సిట్రిక్‌‌ యాసిడ్‌‌ పౌడర్, ఆరెంజ్‌‌ లిక్విడ్‌‌ ప్లేవర్, బెస్ట్‌‌ పాలిష్‌‌ పౌడర్, మిక్సింగ్‌‌ మిషిన్, స్వీట్‌‌ ఆయిల్‌‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రాజేంద్రనగర్‌‌ పోలీసులకు అప్పగించారు.