బాకీలిచ్చిన వారి వేధింపులు భరించలేక .. ఇటుక బట్టీ వ్యాపారి ఆత్మహత్య

బాకీలిచ్చిన వారి వేధింపులు భరించలేక .. ఇటుక బట్టీ వ్యాపారి ఆత్మహత్య
  • అప్పు చేసి కూలీలకు 12.5 లక్షలు ఇచ్చిన రాజేశ్​
  • పని చేయకుండా పారిపోయిన కార్మికులు 
  • డబ్బులు చెల్లించాలని అప్పులోళ్ల  ఒత్తిళ్లు
  • భూమి అమ్మి కడదామంటే అడ్డం పడిన ‘ధరణి’  
  • నిజామాబాద్​ జిల్లాలో విషాదం

నిజామాబాద్​, వెలుగు : జిల్లాలోని జక్రాన్​పల్లి మండలం అర్గుల్​గ్రామానికి చెందిన కుంట రాజేశ్​అలియాస్​ ఇటుకబట్టీ రాజేశ్​(47) అప్పులిచ్చిన వారి వేధింపులు భరించలేక గురువారం పురుగుల మందుతాగి ఆత్యహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు ఏడుస్తూ సెల్​ఫోన్​లో వాయిస్​ రికార్డు చేయగా పోలీసులు ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. అందులోని వివరాల ప్రకారం...ఇటుక బట్టీ బిజినెస్​కోసం రాజేశ్​ తెలిసిన వారి దగ్గరి నుంచి రూ.12.5 లక్షల అప్పు తెచ్చాడు. 

డబ్బులన్నీ లేబర్లకు ఇవ్వగా వారు పని చేయకుండా మోసం చేసి వెళ్లిపోయారు. దీంతో మూడేండ్ల నుంచి  నెలకు రూ.60 వేల వడ్డీ కడుతున్నాడు. డబ్బులు అడ్జస్ట్​ కాకపోవడంతో ప్రతి రోజు10 మంది ఫోన్లు చేసి అప్పు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో తిండి, నిద్ర లేక వేదన అనుభవించాడు. ఉన్న ఎకరం భూమి అమ్మి బాకీ తీరుద్దామంటే ధరణిలో అధిక విస్తీర్ణం నమోదైనందున (ఆర్ఎస్ఆర్​వేరియేషన్​) సమస్య వచ్చి అమ్ముకోలేకపోయాడు. 

చావు తప్ప మరో మార్గం కనిపించకే సూసైడ్ ​చేసుకుంటున్నట్లు తెలిపాడు. వీలైతే తన ఎకరం అమ్మి డబ్బులు సర్దుబాటు చేసుకోవాలని, తన భార్య లలిత సంతకం పెడుతుందన్నారు. అమ్మడానికి వీలుకానట్లయితే అప్పులిచ్చిన వాళ్లంతా కలిసి భూమిని పంచుకోవాలన్నాడు. గ్రామంలో ఉన్న చిన్న కూనిళ్లు, చిన్న ప్లాట్​తన ఇద్దరు కొడుకులకు వదిలేయాలని దండం పెట్టి.. కాళ్లు మొక్కుతున్నట్లు వేడుకున్నాడు. ఎవరితోనూ తప్పుగా మాట్లాడలేదని, జీవితం బాగుండాలని ఆశించి ఇటుక బట్టీ పెట్టానని, లేబర్ల కారణంగా నష్టపోయానన్నాడు. బాకీవాళ్ల టార్చర్​ భరించలేక జీవితాన్ని ముగించుకుంటున్నట్లు పేర్కొన్నాడు.