ప్రజల బతుకులు మారాలంటే టీఆర్ఎస్ను బొందపెట్టాలె : రాజగోపాల్ రెడ్డి

  • రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిండు
  • ఎమ్మెల్యేలను, ఎంపీలను బానిసలుగా చూస్తున్నడు.. నియంతలా పాలిస్తున్నడు
  • బైపోల్​లో ప్రజల తీర్పు కోసం దేశమంతా ఎదురుచూస్తున్నదని వ్యాఖ్య
  • కేసీఆర్​ అబద్ధాలకోరు.. స్వార్థపరుడు: వివేక్​ వెంకటస్వామి
  • వంద మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజలపై దాడి చేస్తున్నరు: ఈటల 
  • చండూరులో ముదిరాజ్​ ఆత్మీయ సమ్మేళనం

మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: ప్రజల బతుకులు మారాలంటే సీఎం కేసీఆర్​ను గద్దె దింపాలని, టీఆర్ఎస్​ను బొంద పెట్టాలని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తన నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, బిల్డింగులకు నిధులు కావాలని అసెంబ్లీ సాక్షిగా ఎన్నిసార్లు అడిగినా కేసీఆర్​ పట్టించుకోలేదని మండిపడ్డారు. ‘‘కేసీఆర్‌‌ ఎప్పుడూ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తప్ప రాష్ట్రంలో మరో నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. టీఆర్ఎస్​లో ఎమ్మెల్యేలు, ఎంపీలను జీతగాళ్లలాగా, బానిసలుగా చేసుకున్నడు. ధైర్యంగా కేసీఆర్ ను అడిగే దమ్ము, ధైర్యం వారెవరికీ లేదు” అని విమర్శించారు. ‘‘హుజూరాబాద్ లాగే ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్​ మునుగోడు ప్రజల దగ్గరికి వస్తడని భావించిన. అందుకే  నేను రాజీనామా చేసిన. ఫామ్ హౌస్​లో పడుకున్న కేసీఆర్​ను మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి తీసుకొచ్చిన” అని తెలిపారు. ఉప ఎన్నిక ఉందని వంద మంది కౌరవ సైన్యం అవినీతి మూటలు పట్టుకుని మునుగోడు పల్లెల్లో మకాం వేసిందని, ప్రజలు గమనించాలని ఆయన అన్నారు. నల్గొండ జిల్లా చండూరులో శనివారం నిర్వహించిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో రాజగోపాల్  మాట్లాడారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, కేజీ టు పీజీ ఉచిత విద్య, రుణమాఫీ ఏమైందని కేసీఆర్​ను ప్రశ్నించారు. ‘‘ఈటల రాజేందర్ ను టీఆర్​ఎస్​ నుంచి బయటికి పంపిన రోజే కేసీఆర్ తన బొంద తానే తవ్వుకున్నడు” అని రాజగోపాల్​రెడ్డి అన్నారు. అసత్య ఆరోపణలు చేసి ఈటల రాజేందర్​ను కేసీఆర్​ బయటికి పంపిన రోజు ఫస్ట్​తానే ఈటలకు ఫోన్​ చేశానని, ఒక నియంతలాగా పాలిస్తున్న దోపిడీదారును గద్దె దించడానికి ఉద్యమించాలని కోరానని చెప్పారు. ‘‘వివేక్ వెంకటస్వామిని కూడా కేసీఆర్​ ఎంతో అవమానించిండు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే బీజేపీలో చేరాలని నా సమక్షంలోనే ఈటల రాజేందర్​ను వివేక్ వెంకటస్వామి ఆహ్వానించి ఢిల్లీకి తీసుకెళ్లారు. హుజూరాబాద్ ఎన్నికలో కూడా వివేక్​ వెంకటస్వామి కీలకపాత్ర పోషించారు. ఈ రోజు నన్ను ముందుండి నడిపిస్తున్నారు” అని రాజగోపాల్​రెడ్డి తెలిపారు. బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదని, కేసీఆర్‌‌‌‌ నియంతలా అరాచక పాలన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

రాజగోపాల్​ గెలుపు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మలుపు: ఈటల

తెలంగాణ ఉద్యమంలో, ప్రభుత్వం వచ్చాక ఎంతో కీలకంగా పనిచేసిన తనను, 20 ఏండ్ల సోపతిని కాదనుకొని కేసీఆర్‌‌‌‌ బయటకు వెళ్లగొట్టారని హుజూరాబాద్‌‌‌‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌‌‌ అన్నారు. ‘‘నన్ను టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి బయటికి పంపిన తర్వాత మొట్టమొదట రాజగోపాల్‌‌‌‌ ఫోన్‌‌‌‌ చేసి.. మీరు ఒంటరి కాదు.. వెంట ఉంటానని చెప్పారు. హుజూరాబాద్‌‌‌‌లో నా గెలుపుతో ప్రతి పల్లె పటాకులు కాల్చి సంబురాలు చేసుకుంది. రాజగోపాల్‌‌‌‌ రెడ్డిని కాంగ్రెస్‌‌‌‌ నుంచి సస్పెండ్‌‌‌‌ చేస్తామని సోనియాగాంధీ హెచ్చరించినా పట్టువిడువకుండా తెలంగాణ కోసం ఆయన కొట్లాడిండు” అని తెలిపారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం కాదని, అన్ని వర్గాల ప్రజల కోసమనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ‘‘అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌‌‌‌కు వ్యతిరేకంగా మాట్లాడే వారే ఉండొద్దు అన్నట్టుగా పాలకుల తీరు ఉంది. ఎమ్మెల్యే పదవి ప్రజల ఆశీర్వాదంతోనే వచ్చింది. మూడున్నరేండ్లుగా కుమిలిపోతూ పదవిలో ఉండొద్దని, రాజీనామా అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని రాజగోపాల్​కు సూచించిన. ఎమ్మెల్యేకు గౌరవం లేకపోతే మునుగోడు ప్రజలకు లేనట్టేనని చెప్పిన. రాజీనామా ముఖం మీద కొట్టి ప్రజల చెంతకు  రాజగోపాల్​ వచ్చిండు. ఆయనకు ప్రజలు అండగా నిలవాలి’’ అని రాజేందర్​ కోరారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా అనేక గ్రామాల్లో రోడ్లు వేయించిన ఘనత రాజగోపాల్‌‌‌‌ ది అని తెలిపారు. కాంగ్రెస్‌‌‌‌ పార్టీ పని ఖతమైపోయిందన్నారు. వంద మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజలపై దాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజగోపాల్‌‌‌‌ గెలుపు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మలుపు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్​కు ఓటేస్తే టీఆర్​ఎస్​కు వేసినట్టే: లక్ష్మణ్​

మునుగోడులో కాంగ్రెస్‌‌‌‌కు ఓటేస్తే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు వేసినట్టేనని ఎంపీ డాక్టర్‌‌‌‌ కె. లక్ష్మణ్‌‌‌‌ అన్నారు. ‘‘బీసీల హక్కుల గురించి ప్రశ్నిస్తున్నడనే ఈటల రాజేందర్‌‌‌‌ను కేసీఆర్‌‌‌‌ బయటకు పంపిండు. తనను ప్రశ్నించేవారే ఉండొద్దన్నదని ఆయన నైజం. కేసీ ఆర్​ పాలనలో రాష్ట్రంలో సామాజిక న్యాయమే లేదు” అని దుయ్యబట్టారు. బీసీ బిడ్డ తలెత్తుకుని తిరిగేలా హుజూరాబాద్‌‌‌‌ ప్రజలు గెలిపించారని అన్నారు.  రాజగోపాల్‌‌‌‌ రెడ్డి ఒంటరి కాదని, కేంద్రంలో మోడీ, అమిత్‌‌‌‌ షా అండగా ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌‌‌‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కులవృత్తులన్నీ దెబ్బతిన్నాయన్నారు. 

రాష్ట్రంలో వచ్చేది బీజేపీ సర్కారే: సంజయ్​ నిశాంత్​

మునుగోడులో రాజగోపాల్​రెడ్డిని గెలిపించాలని ఉత్తర ప్రదేశ్ మత్స్య శాఖ మంత్రి సంజయ్ నిశాంత్  కోరారు. అన్ని కుల వృత్తులకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్న పార్టీ బీజేపీ అని, అన్ని కులాలు బీజేపీతో కలిసి రావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డులాగే ఫిషరీస్ క్రెడిట్ కార్డును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీంతో మత్స్యకారులు రూ.1.60 లక్షలు క్రెడిట్ తీసుకోవచ్చని తెలిపారు. ఉత్తర ప్రదేశ్ లో రామమందిర నిర్మాణం పురోగతిలో ఉందని, అనుకున్న సమయానికి పూర్తి చేసి చూపిస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి, ముదిరాజ్ సంఘం నేత చొప్పరి‌‌‌‌ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ ‌‌‌‌రెడ్డి,  మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, సదానంద్ ముదిరాజ్, అందె బాబన్న ముదిరాజ్, కావలి ఆంజనేయులు, బైరి శంకర్ ముదిరాజ్, పిట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కల్వకుంట్ల కుటుంబమే బాగుపడ్డది

కాంగ్రెస్ పార్టీ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని కేసీఆర్​ కొనుక్కున్నడు. ప్రతిపక్షం లేకుండా గొంతు నొక్కేందుకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిండు. అవినీతి సొమ్ముతో ఇప్పుడు మునుగోడులో నాయకులను కొంటున్నడు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబమే బాగుపడ్డది. ప్రజల బతుకులు మారలేదు. బెల్టు షాపులతో కుటుంబాలను టీఆర్​ఎస్​ సర్కార్​ ఆగం చేస్తున్నది.  అప్పులపాలైన తెలంగాణను గాడిన పెట్టాలంటే బీజేపీతోనే సాధ్యం. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు కోసం దేశమంతా ఎదురుచూస్తున్నది. - కోమటిరెడ్డి రాజగోపాల్