మునుగోడులో ఉపందుకున్న నామినేషన్ల ప్రక్రియ

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, కిషన్రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ మునుగోడు స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ సహా పలువురు బీజేపీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. 

మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సైతం ఈ రోజే నామినేషన్ వేయనున్నారు. అనుచరులతో కలిసి ఆయన వెళ్లి ఇవాళ నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. మునుగోడు నియోజకవర్గం బైపోల్కు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారం స్పీడప్ చేశాయి. నియోజకవర్గంలోని ఏ గ్రామంలో చూసినా సందడి వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటి ప్రచారంలో బిజీ అయ్యారు. నిన్న చౌటుప్పల్ మండలంలో రేవంత్, ఉత్తమ్ కలిసి ప్రచారం చేశారు. ఇవాళ కూడా కాంగ్రెస్ ముఖ్య నేతల ప్రచారాలు కొనసాగనున్నాయి.