ప్రపంచ దేశాలతో ఇండియా పోటీపడేవిధంగా సాంకేతిక విప్లవానికి ఆద్యుడిగా నిలిచిన మహానేత రాజీవ్ గాంధీ. ఆయన హయాంలో పల్లె పల్లె కు టెలిఫోన్ సౌకర్యం వచ్చింది. ఇవాళ మనందరి చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయంటే, దానికి కారణం ఆనాడు రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయమే. విదేశాల్లో ఉన్న శామ్ పిట్రోడా ను భారత దేశంకు రప్పించి టెలికమ్యూనికేషన్ రంగంలో విప్లవం తీసుకువచ్చారు. రాజీవ్ గాంధీ అమలు చేసిన విప్లవాత్మకమైన విధానాల వల్లనే ఇవాళ ఇంటింటా కంప్యూటర్‌తో పాటు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది అనేది ఎవరు కాదనలేని నిజం.
తల్లికి అండగా ఉండేందుకు రాజకీయ ప్రవేశం
1980 జూన్ 23న తమ్ముడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో చనిపోవడంతో తల్లి ఇందిరకు సహాయంగా ఉండటానికి పైలెట్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజీవ్ రాజకీయాల్లోకి వచ్చారు. 1981 ఫిబ్రవరి 16న తొలిసారి ఓ రైతుల సమావేశంలో మాట్లాడి రాజీవ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1981 ఆగస్టులో తమ్ముడు సంజయ్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేథీ లోక్ సభ నియోజకవర్గం నుంచి రాజీవ్ పోటీ చేసి భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు. తర్వాత ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ అయ్యారు. అప్పటినుంచి పార్లమెంటరీ పద్ధతులను, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని రాజీవ్ బాగా అధ్యయనం చేశారు.ఆయన స్వతహాగాచదువరి, మేధావి. ఓ గొప్ప నాయకుడిగా ఎదిగే క్రమంలో చెప్పడం కంటే వినడం ఎక్కువగా అలవాటు చేసుకున్నారు. ప్రతి అంశాన్ని, సమస్యను ప్రజల కోణంలో పరిశీలించడం మొదలెట్టారు. సామాన్య ప్రజల జీవితాల్లో మంచి మార్పు కోసం ఆలోచించడం ప్రారంభించారు. ఒక బాధ్యతను తీసుకుంటే దానిని నెరవేర్చడం కోసం రాత్రింబవళ్లు కష్టపడటం రాజీవ్ నైజం. ఇందుకు నిదర్శనమే 1982లో ఇండియా నిర్వహించిన ఏసియన్ గేమ్స్. దేశం గర్వపడేవిధంగా ఏసియన్ గేమ్స్ ను రాజీవ్ నిర్వహించారు.
అనుకోని పరిస్థితుల్లో ప్రధాని అయ్యారు
బాడీ గార్డు జరిపిన కాల్పుల్లో 1984 అక్టోబరు 31 న ఇందిర ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. ఆ సమయంలో సంయమనం పాటించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు, దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చి మానవతా విలువలున్న నాయకుడిగా నిరూపించుకున్నారు. 1984 డిసెంబర్ 31న కేవలం 40 ఏళ్ల వయసులో ఇంత పెద్ద దేశానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.దేశానికి తనదైన శైలిలో పాలన అందించారు. దేశాన్ని అన్ని రంగాల్లో ముఖ్యంగా టెక్నాలజీపరంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రధానిగా కృషి చేశారు. పరిపాలనలో జవాబుదారీతనం పెంచడానికి అనేక చర్యలు తీసుకున్నారు. వ్యక్తిగతంగా ‘మిస్టర్ క్లీన్ ’ ఇమేజ్ తెచ్చుకున్నారు. అవినీతి ఆరోపణలు రుజువైతే ఎంత పెద్ద సీనియర్ నాయకులనైనా కేబినెట్ నుంచి నిర్మొహమాటంగా తొలగించడానికి కూడా ఆయన వెనకాడలేదు.
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి పెద్ద పీట వేశారు. పేదలకు, సమాజంలో అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం కోసం కృషి చేశారు. పంచాయితీరాజ్, స్థానిక సంస్థల సాధికారత కోసం తపించారు. ఆయన ఆలోచనల స్ఫూర్తితోనే రాజ్యాంగానికి 73,74వ రాజ్యాంగ సవరణలు తీసుకువచ్చారు. మన దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికింది రాజీవ్ గాంధీనే. సైన్సు అండ్ టెక్నాలజీ, కంప్యూటర్స్ రంగాల అభివృద్ధి కోసం దిగుమతుల పై టాక్సులను తగ్గించారు. రైల్వేల్లో తొలిసారి కంప్యూటరైజ్డ్ టికెట్స్ ప్రవేశ పెట్టి న ఘనత రాజీవ్ దే. మానవ వనరుల అభివృద్ధికి పెద్ద పీటవేశారు. మొట్ట మొదటిసారిగా ‘ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ మెంట్ ’ ( హెచ్ ఆర్డీ ) మినిస్ట్రీ ని ఏర్పాటు చేసి, దానికి కేబినెట్ మంత్రిగా తెలుగు బిడ్డ పీవీ నరసింహారావును నియమించారు. జాతీయ విధ్యా విధానాన్ని అమలు చేశారు.నవోదయ విద్యాలయాలు స్థాపించి విద్యా రంగంలో సమూల మార్పుల కోసం కృషి చేశారు. పెద్ద సంఖ్యలో దళిత వర్గానికి చెందిన టీచర్లను నియమించారు. దళిత స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్స్ పెంచి వారికి అండగా నిలబడ్డారు. దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ’ విధానాన్ని అమలు చేశారు. ఓపెన్ యూనివర్శిటీతో చదువును అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పార్టీ ఫిరాయింపులకు బ్రేక్ వేయడానికి చట్టం తీసుకువచ్చారు. 18 ఏళ్లు ఉన్న వారందరికీ ఓటు హక్కు కల్పించి వారిని నవ భారత నిర్మాణంలో భాగస్వాములను చేశారు. పాకిస్థాన్, అమెరికా, రష్యాతో పాటు అన్ని ప్రపంచ దేశాలతో సత్సంబంధాల కోసం కృషి చేశారు. మానవ ప్రగతికి అణుబాంబులు ముఖ్యం కాదన్నారు. శాంతి, స్వేచ్ఛ, సమానత్వం వంటి కీలక అంశాలతోనే అభివృద్ది సాధ్యమవుతుందని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తేల్చి చెప్పి, ప్రపంచ దేశాల అభినందనలు అందుకున్నారు.
పాలిటిక్స్‌కు హ్యూమన్ టచ్
విలువలతో కూడిన రాజకీయాలకు రాజీవ్ ప్రాధాన్యం ఇచ్చారు. తాను ప్రధానమంత్రి గా ఉన్న సమయంలో, అప్పటి ప్రతిపక్ష నాయకుడు, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారని తెలిసి, యునైటెడ్ నేషన్స్ సదస్సు పేరు మీద అమెరికా కు పంపించి ప్రభుత్వ ఖర్చుల తో ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పించారు రాజీవ్. ప్రతిపక్ష నాయకుల పట్ల అంత గౌరవంతో ఆయన వ్యవహరించారు. ఆయనకున్న మిస్టర్ క్లీన్ ఇమేజ్ ను దెబ్బతీయడానికి బోఫోర్స్ కుంభకోణాన్ని బయటకు తీశారు. ఈ కుంభకోణంలో రాజీవ్ గాంధీ నిర్దోషి అని 1984 ఫిబ్రవరిలో ఢిల్లీ హై కోర్టు తీర్పు చెప్పింది. అయినా ఇప్పటికీ నరేంద్ర మోడీ వంటి నాయకులు బోఫోర్స్ కుంభకోణంతో ఆయన పేరును ముడిపెట్టి మాట్లాడుతుంటారు. మోడీ దిగజారుడు రాజకీయాలకు ఆయన కామెంట్సే నిదర్శనం. ప్రధాని పదవి నుంచి దిగిపోయాక ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని, ‘ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ’ ( ఎస్పీజీ) భద్రత కల్పించాలని కోరినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూర్లో తమిళ టైగర్ల ఆత్మాహుతి దాడిలో రాజీవ్ ప్రాణాలు కోల్పోయారు. దేశం కోసం రాజీవ్ తన నిండు జీవితాన్ని అర్పించారు. శత్రువులను క్షమించే గుణం అందరికీ ఉండదు. తన భర్త రాజీవ్ ను హతమార్చిన నళినికి క్షమాబిక్ష పెట్టాలని సోనియా గాంధీ ప్రభుత్వాన్ని కోరారు. ప్రియాంక గాంధీ అయితే ఏకంగా వెల్లూరు జైలుకే వెళ్లి నళినితో పాటు రాజీవ్ హత్యతో సంబంధం ఉన్నవారందరినీ కలిసి వచ్చారు.
నిష్పక్షపాతంగా, వాస్తవ దృక్కోణంలో ఆలోచిస్తే, దేశ రక్షణకోసం తమ జీవితాలను త్యాగం చేసేందుకే ఈ కుటుంబం పుట్టిందా అనే అనుమానం కల్గుతుంది. దేశ స్వాతంత్య్రం కోసం జవహర్ లాల్ నెహ్రు, కొన్నేళ్లు జైలుశిక్ష అనుభవిస్తే, ఇందిరా గాంధీ తన వంతు అన్నట్లు, దేశ సమగ్రత కోసం తన ప్రాణాల్ని బలి పెట్టింది. చివరికి రాజీవ్ గాంధీ సైతం తన నిండు జీవితాన్ని దేశానికి అర్పించారు.
రాజీవ్ తన పాలనతో తాత జవహర్ లాల్ నెహ్రూను మైమరిపించారు. నిర్ణయాలలో తల్లి ఇందిర జ్ఞాపకం వచ్చేలా పనిచేశారు.ఆధునిక పోకడలున్న రాజకీయ నాయకుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. దేశం కోసం రాజీవ్ ప్రాణత్యాగం చేసిన మే 21 ను ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నాం. ఈ సందర్భంగా కుట్రలు, కుతంత్రాలు, విద్వేషాలు, విభజనవాదాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అట్టడుగు, బలహీన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం కోసం రాజీవ్ వేసిన బాటలో కలిసి నడవడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి.
శ్రీపెరంబుదూర్‌లో ఆ చివరి క్షణాలు
రాజీవ్ గాంధీ 1991 మధ్యంతర ఎన్నికల ప్రచారంలో శ్రీ పెరంబుదూర్‌కి వస్తున్న సందర్భంలో… ఆయనను హత్య చేయడానికి ఎదురుచూస్తున్న శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈ ఆత్మాహుతి గ్యాంగ్ థానూ, శివరాసన్‌లు. వారికి తమిళనాడులో ఆశ్రయం ఇచ్చిన తల్లీకూతుళ్లిద్దరూ కూడా ఈ దాడిలో చనిపోయారు. ఎల్టీటీఈని శ్రీలంక ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చడంలో రాజీవ్ చాలా చొరవ తీసుకున్నారు. అక్కడి తమిళులకు ఆహార సమస్య రాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలద్వారా సరుకులు పంపించారు. అలాగే, పీస్ కీపింగ్ ఫోర్స్ (ఐపీకేఎఫ్)ని పంపించి, తమిళులపై శ్రీలంక సైన్యం దాడులు చేయకుండా శాంతి పరిరక్షణకు సాయపడ్డారు. ఇంత చేసినప్పటికీ… ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్‌లో మార్పు రాలేదు. చివరికి 1991 మే 21న రాజీవ్ హత్యకు హ్యూమన్ బాంబులను పంపించి పొట్టనబెట్టుకున్నాడు. (ఇవాళ రాజీవ్ గాంధీ వర్ధంతి)
డా శ్రవణ్ దాసోజు
జాతీయ అధికార ప్రతినిధి
ఆల్ ఇండియా కాం గ్రెస్ కమిటీ