
రజనీకాంత్ సినిమా వస్తోందంటే అభిమానులకే కాదు… సౌత్‌లోని సినీ ప్రియులందరికీ పండుగే. అందులోనూ మురుగదాస్ లాంటి డైరెక్టర్, నయనతార లాంటి హీరోయిన్ కాంబినేషన్ అంటే అంచనాలు మరింత భారీగా ఉంటాయి. పైగా ఇరవయ్యేళ్ల తర్వాత రజనీ పోలీసాఫీసరుగా నటిస్తున్నారంటే ఇక మామూలుగా ఉంటుందా! అందుకే ‘దర్బార్’ మూవీపై చెప్పలేనంత ఆసక్తి నెలకొంది. దానికి తోడు వరుసగా లీకవుతున్న షూటింగ్ స్పాట్ ఫొటోలు చూసి మరిన్ని అంచనాలు వేసేసుకుంటున్నారు ఫ్యాన్స్. వారి క్యూరియాసిటీని గమనించాడోఏమో… మేమే రజనీని మీకు చూపిస్తాం చూసుకోండి అంటూ ప్రకటించాడు మురుగదాస్. చెప్పినట్టుగానే గురువారం రజనీ లుక్ రిలీజ్ చేశాడు. ఖాకీ డ్రెస్సుపై లాంగ్ కోటు వేసుకుని, చేతిలో ఆయుధంతో అగ్రెసివ్‌గా కనిపిస్తున్నారు సూపర్ స్టార్. రేగిన దుమ్ములో ఫైట్ చేస్తూ తన స్టైల్‌తో దుమ్ము రేపారు. దీంతో పాటు సూట్ వేసుకుని కూల్‌గా ఉన్న మరో స్టిల్‌ను కూడా బైటికి వదిలారు. క్షణాల్లో ఈ రెండూ వైరల్ అయిపోయాయి. ఈ దెబ్బతో ‘దర్బార్’కి మరింత హైప్ క్రియేట్ అయిపోవడం ఖాయం.