రజనీకాంత్ బీజేపీకి అక్కరకు వస్తారా!

రజనీకాంత్ బీజేపీకి అక్కరకు వస్తారా!

వచ్చే ఏడాది వేసవిలో తమిళనాట అసెం బ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే వేడి మొదలైంది. దక్షణాది రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని బీజేపీ పట్టుదలగా ఉంది. కర్నాటకలో ఎప్పటి నుంచో బలమైన రాజకీయ పక్షంగా ఉన్నప్పటికీ.. పక్కనే ఉన్న తమిళనాడులో ఆ పార్టీకి కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. 2021 ఎన్నికల్లో ఈ పరిస్థితి మారాలని, బీజేపీ తమిళనాడులోనూ బలమైన శక్తిగా ఎదగాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల్లో గ్లామర్ ఉన్న నాయకులను తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది. సినీ నటి కుష్బూ, నిజాయితీ పరుడిగా పేరున్న ఐఏఎస్ అధికారి అన్నామలై వంటి వాళ్లను పార్టీలోకి చేర్చుకుంటూఎన్నికలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బీజేపీకే అండగా నిలుస్తారని ఆ పార్టీ పెద్దలు ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయ ప్రవేశంపై పునరాలోచనలో పడినట్లు ఆయన ఇటీవలే ప్రకటించడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.

మరో ఆరు నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగవలసిన తరుణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం గురించి మరోమారు చర్చలు ప్రారంభమయ్యాయి. ఆ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆయన రాజకీయ ప్రవేశం ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మిగులుతుంది. 1996 నుంచి రాజకీయ ప్రవేశం గురించి సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. కానీ ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించే సాహసం చేయలేదు. చివరకు 2021 అసెంబ్లీ ఎన్నికల నాటికి తాను ఒక రాజకీయ పార్టీ ప్రారంభించి, అన్ని సీట్లలో పోటీ చేయబోతున్నట్లు రెండేళ్ల క్రితం ప్రకటన చేశారు. అయితే ఆ తర్వాత ఏవో కొన్ని సమాలోచనలు మినహా యాక్టివ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టే సన్నాహాలు పెద్దగా లేవు. ఇప్పుడు మళ్లీ తన అనారోగ్యం కారణంగా రాజకీయ ప్రవేశం వీలుకాదనే  సంకేతం ఇస్తూ మూడ్రోజుల క్రితం ట్వీట్ చేశారు. ఆయనపై ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఇది ఊహించని షాక్ లాంటిదే.

జయ మరణం తర్వాత చాన్స్

2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని పదవిలోకి వచ్చిన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్న అమిత్ షా ఆ పార్టీకి పెద్దగా పట్టులేని దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, పశ్చిమబెంగాల్, అస్సాంలలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యమని ప్రకటించారు. ఆ తర్వాత అస్సాంలో అధికారం సొంతం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్, ఒరిస్సాల్లో కాంగ్రెస్ ని పక్కకు నెట్టి బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించే స్థాయికి తెచ్చారు. కానీ దక్షిణాదిలో కర్నాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఇప్పటికీ అంతంత మాత్రమే. అయితే తమిళనాడు సీఎం జయలలిత మరణించాక ఆ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. దాన్ని వాడుకుని గట్టి శక్తిగా నిలబడాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేదు. కానీ జయ మరణంతో జవసత్వాలు కోల్పోయిన అన్నాడీఎంకే ప్రభుత్వం కూలిపోకుండా కాపాడడంలో కేంద్రమే పెద్దన్న పాత్ర పోషించింది. జయలలిత మరణించి మూడేళ్లు దాటినా అన్నాడీఎంకే తన బలాన్ని పూర్వస్థితికి పెంచుకోలేకపోయింది. ఈ సమయంలో రెండు ద్రవిడ పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలను అధికారంలోకి రానీయకుండా చేయాలంటే రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఆయన మూడో పవర్ సెంటర్ గా మారి రాజకీయ సమీకరణాలు మారుతాయని బీజేపీ గట్టిగా నమ్ముతోంది.

దళిత వర్గాలను ఆకట్టుకునే దిశగా..

తమిళనాడు రాజకీయాలను ఐదు దశాబ్దాలుగా శాసిస్తున్న ద్రావిడ పార్టీలు రెండింటిలో ఈబీసీ వర్గాలకే కీలక పదవులు లభిస్తున్నాయి. దళిత వర్గానికి చెందిన వారెవ్వరికి కీలకమైన మంత్రిత్వ శాఖ కూడా లభించలేదు.  ఈ వర్గాలలో నెలకొన్న అసంతృప్తిని రాజకీయ ఆయుధంగా మలుచుకోవాలని బీజేపీ, రజనీకాంత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా దళిత వర్గానికి చెందిన కె.మురుగన్ ను నియమించడం, రజనీకాంత్ సినిమాలైన కబాలి, కాలా చిత్రాలలో అణగారిన వర్గాల ప్రతినిధిగా నటించడం అన్ని రాష్ట్ర జనాభాలో 21 శాతంగా ఉన్న దళిత వర్గాలను ఆకట్టుకోవడం కోసంగానే కనిపిస్తున్నది. 1996లో అధికారంలో ఉన్న జయలలితను తిరిగి సీఎంగా గెలిపిస్తే దేవుడు కూడా రాష్ట్రాన్ని కాపాడలేరంటూ రజనీ చేసిన ప్రకటన నాడు సంచలనం కలిగించింది. ఆ సమయంలో జయ ఓడిపోయి డీఎంకే అధికారాన్ని సొంతం చేసుకోవడంతో ఆ ఖ్యాతి అంతా రజనీ ఖాతాలో పడింది. అప్పట్లో ఆయనే సీఎం అవుతారని అనుకున్న సందర్భాలూ ఉన్నాయి. కానీ మళ్లీ 1998 లోక్ సభ ఎన్నికలలో ఆయన మద్దతు ప్రకటించిన డీఎంకే- – కాంగ్రెస్ కూటమి, 2004లో అన్నా డీఎంకే – బీజేపీ కూటమి ఘోరంగా ఓడిపోవడంతో ఆయన సినీ గ్లామర్ ఎంత మేరకు ఓటర్లపై ఉంటుందన్న అనుమానాలకు బీజం వేసింది.

పార్టీ పెట్టకున్నా రజనీ అండ!

కొద్ది కాలం నుంచి రజనీకాంత్, బీజేపీ తమిళనాడులో వ్యూహాత్మకంగా రాజకీయ పావులు కదుపుతున్నట్లు కనిపిస్తున్నది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి రజనీకాంత్ బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. రజనీకాంత్ సొంతంగా పార్టీ పెట్టకపోయినా తమకు మద్దతు ప్రకటిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, దక్షిణాది ఇన్ ఛార్జ్ గా నియమితులైన మాజీ కర్ణాటక మంత్రి సీటీ రవి ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మధ్య కాలంలో ఐపీఎస్ కు రాజీనామా చేసి, కర్ణాటక క్యాడర్ అధికారి కె అన్నామలై, ఆ తర్వాత ప్రముఖ సినీ నటి కుష్బూ సుందర్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం వెనుక రజనీకాంత్ ప్రమేయం లేదని చెప్పలేం. పైగా రజనీకాంత్ పార్టీ ప్రారంభించి ఉంటే అన్నామలైనే ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తారని కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రచారం దీనికి బలం చేకూరుస్తోంది.

For More News..

చట్ట సవరణ ఓకే చేయకముందే రిజిస్ట్రేషన్లు ఎట్ల చేస్తరు?

అమెరికా ఎన్నికల్లో మనోళ్లు గెలిచిన్రు

సన్న వడ్లపై బోనస్​ తేల్తలే.. రైతు గోస తీర్తలే