నా బిడ్డ చచ్చిపోయిన పీడ పోయేది.. నా ముగ్గురు మనవళ్లను చంపింది: రజిత పేరెంట్స్

నా బిడ్డ చచ్చిపోయిన పీడ పోయేది.. నా ముగ్గురు మనవళ్లను చంపింది: రజిత పేరెంట్స్

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రజిత అనే మహిళ తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి ఆ తర్వాత ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రజిత తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురు రజిత, అల్లుడు చెన్నయ్య ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోయినా ఏం కాకపోతుండేనని.. చివరకు నా బిడ్డ చనిపోయిన పీడ పోయేదని.. అనవసరంగా నా ముగ్గురు మనవళ్లను చంపిందని బోరున విలపించారు. వీరిద్దరి గొడవ పడి దేవుడితో సమానమైన చిన్న పిల్లలను పొట్టనబెట్టుకున్నారని ఎమోషనల్ అయ్యారు.

 ‘‘గత పదేళ్ళుగా భార్యాభర్తలు రజిత, చెన్నయ్య మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. చెన్నయ్య, రజితను కొట్టినప్పుడల్లా మా ఇంటికి వచ్చేది. మళ్లీ చెన్నయ్యే వచ్చి నాదే తప్పు అని చెప్పి తీసుకుపోయేవాడు. కానీ ఈ మధ్య గొడవ జరిగినప్పుడు మాత్రం ఇద్దరూ సీరియస్ అయ్యారు. మరోసారి గొడవ జరిగితే నేనే ముగ్గురు పిల్లలను చంపుతానని చెన్నయ్య అన్నాడు. రజిత కూడా ముగ్గురు పిల్లలు చంపి నేను చచ్చిపోతానని చెప్పింది. అసలు వీళ్లిద్దరూ గొడవ పడి పిల్లలను చంపడం ఏంటో తెలియట్లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.  

అసలేం జరిగిందంటే..?

వాటర్ ట్యాంకర్ డ్రైవర్‎గా పనిచేస్తోన్న చెన్నయ్య (40), రజిత(38) దంపతులు అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి కృష్ణ (12) మధుప్రియ (10) గౌతమ్ (8) ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా భార్యభర్తలు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం (మార్చి 27) రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. పప్పు, పెరుగుతో డిన్నర్ చేశారు. లావణ్య, ముగ్గురు పిల్లలు పప్పు, పెరుగుతో తినగా.. చెన్నయ్య మాత్రం పప్పు ఒకటే తినేసి డ్యూటీకి వెళ్లాడు. రాత్రి 11 గంటలకు డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య అపస్మారక స్థితిలో ఉండటంతో ఆందోళనకు గురైన చెన్నయ్య చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి  తరలించాడు. 

ఇంటికి వెళ్లి చూడగా ముగ్గురు పిల్లలు చనిపోయి ఉన్నారు. సమాచారం అందుకున్న అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఘటన స్థలాన్ని పరిశీలించి మరణాలకు గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పెరుగులో విషం కలిపి పిల్లలను చంపి.. ఆ తర్వాత లావణ్య ఆత్మహత్యయత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.