బీజేపీని గెలిపిస్తే బీసీ నేతే సీఎం : రాజీవ్ చంద్రశేఖర్

సూర్యాపేట, వెలుగు:   బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి బీసీ నేత సీఎం అవుతాడని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. శుక్రవారం సూర్యాపేట బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు నామినేషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 60 ఏండ్లు అధికారంలో ఉన్నా అభివృద్ధి చేయని కాంగ్రెస్..  ఇప్పుడు ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.  సీఎం కేసీఆర్‌‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నోళ్లకు మాత్రమే అందుతున్నాయని విమర్శించారు.

 తాను ప్రధాని మోదీ ప్రతినిధిగా సూర్యాపేటకు వచ్చానని,  సంకినేనిని  గెలిపిస్తే  సూర్యాపేటకు రైల్వే లైన్, జాతీయ రహదారిపై అండర్ పాసులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనరంతరం సంకినేని మాట్లాడుతూ..  మంత్రి జగదీశ్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లతో కుమ్మక్కై రూ.1,200 కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు.  పటేల్ రమేశ్ రెడ్డి ఎన్నికలప్పుడు వేలంపాటకు వస్తాడని,  ఎవరు కేజీ ఎక్కువ ఇస్తే వారికి అమ్ముడు పోతారని విమర్శించారు.  దామోదర్ రెడ్డి వెంట ఉన్న దండుపాళం ముఠా ఇప్పుడు  మంత్రి జగదీశ్‌ రెడ్డి దగ్గర ఉందని, వట్టె జానయ్య యాదవ్ నాయీంను  మించి భూకబ్జాలు చేశారని ఆరోపించారు.