యూపీఎస్సీలో ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం’ అభ్యర్థుల సత్తా

యూపీఎస్సీలో ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం’ అభ్యర్థుల సత్తా
  • లక్ష సాయం అందిన135 మందిలో 20 మంది ఇంటర్య్యూకు ఎంపిక
  • చిరుదీపం కొండంత వెలుగునిస్తుందని రేవంత్ రెడ్డి ట్వీట్

హైదరాబాద్, వెలుగు: యూపీఎస్సీ మెయిన్స్ 2024 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం రాజీవ్ సివిల్స్ అభయ హస్తం కింద రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేసిన సంగతి తెలిసిందే. సాయం అందుకున్న అభ్యర్థుల్లో 20 మంది తాజాగా యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాల్లోనూ విజేతలుగా నిలిచి ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు.

వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ఈసాయి శివాని, రాహుల్ శంకేషి, పోతరాజు హరి ప్రసాద్, విక్రమ్ బేతి, ఖమ్మం జిల్లాకు చెందిన నల్లమల సాయికుమార్, బానోతు నాగ రాజా నాయక్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన కడారి శ్రీవాణి, గాదె శ్వేత, రాపర్తి ప్రీతి, మెదక్ జిల్లాకు చెందిన కుమ్మరి శ్రవణ్ కుమార్, రంగారెడ్డి జిల్లాకు చెందిన మొహమ్మద్ అశ్ఫాక్, తొగరు సూర్యతేజ, మహబూబాబాద్ జిల్లాకు చెందిన బెస్త ప్రియాంజలి, సిద్దిపేటకు చెందిన నరిగె స్వామి, నాగర్‌‌కర్నూలుకు చెందిన గోకమల్ల అంజనేయులు, ఆదిలాబాద్‌‌కు చెందిన ఆర్.ప్రమోద్ కుమార్, వికారాబాద్‌‌కు చెందిన బి.ప్రహ్లాద్, జగిత్యాలకు చెందిన బురుగుపెల్లి నీరజ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన జస్వంత్ కుమార్, ఆసిఫాబాద్ -కుమ్రంభీం జిల్లాకు చెందిన రామ్​టెంకి సుధాకర్ ఇంటర్వ్యూకు ఎంపికైన జాబితాలో ఉన్నారు.

సివిల్స్ సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభ‌‌య హ‌‌స్తం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది తొలిసారిగా అమలు చేసింది. సింగరేణి సంస్థ అధ్వర్యంలో 135 మందికి  రూ.ల‌‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఆగస్ట్ 26న సీఎం రేవంత్ వీరికి చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్రం నుంచి మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటిన అభ్యర్థులందరికీ సీఎం అభినందనలు తెలిపారు. 

‘‘ఒక చిరు దీపం కొండంత వెలుగును ఇస్తుంది.. ప్రభు త్వం అందించిన ఒక చిరు సాయం యూపీఎస్సీ పరీక్షల్లో గొప్ప ఫలితాలు ఇచ్చింది. ఈ విజయం తెలంగాణ సర్కారు సారథిగా నాకు గొప్ప ఆనందాన్ని కలిగించిం ది. ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం’ పేరుతో సింగరేణి సహకారం, ప్రజా ప్రభుత్వం చేసిన ఆర్థిక సాయాన్ని అందిపుచ్చుకుని.. ఒకే దఫా 20 మంది తెలంగాణ పేద బిడ్డలు ఈ దేశ భవిష్యత్ ను నిర్మించే అవకాశం ఉన్న అఖిల భారత సర్వీసు ప్రధాన పరీక్షలో రాణించడం తెలంగాణ సమాజానికి గర్వకారణం’’- సీఎం రేవంత్​రెడ్డి