హైదరాబాద్, వెలుగు: రాజీవ్ గాంధీ అమర జ్యోతి యాత్ర బుధవారం గాంధీ భవన్కు చేరుకుంది. ఈ యాత్ర బృందానికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. పెరుంబుదూర్ లో ప్రారంభమైన ఈ యాత్ర ఈ నెల 20న ఢిల్లీకి చేరుకోనుంది. మూడ్రోజుల క్రితం కూడా మొదటి జ్యోతి యాత్ర గాంధీ భవన్కు రాగా, ఇప్పుడు చివరి జ్యోతి యాత్ర ఢిల్లీ వెళ్తూ మార్గమధ్యలో హైదరాబాద్కు చేరింది. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన నేత రాజీవ్ గాంధీ అని అన్నారు.
పంచాయతీ రాజ్ చట్టంతో పాటు మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలను రూపొందించారని తెలిపారు. రాజీవ్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతున్నదన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలు ప్రజలకు తెలిసే విధంగా ఈ అమర జ్యోతి యాత్ర కొనసాగుతున్నదని రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ అన్నారు. రాజీవ్ ఇప్పటికీ దేశ ప్రజల హృదయాల్లో నిలిచారని, ఆయన జ్ఞాపకార్థం పెరుంబుదూర్ నుంచి అమర జ్యోతిని ఢిల్లీకి తీసుకువెళ్తున్నామని రాజీవ్ అమర జ్యోతి ఆర్గనైజర్ దొరై అన్నారు. రాజీవ్ జయంతి రోజైన ఈ నెల 20న ఈ జ్యోతిని సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేకు అందజేస్తామని చెప్పారు.