నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు.. రిజల్ట్ వెలువడిన 30 రోజుల్లోగా ఎన్నికల్లో చేసిన ఖర్చుల వివరాలు సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. వివరాలు వెల్లడించని పక్షంలో మూడేండ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలక్షన్ కమిషన్ అనర్హత విధిస్తోందని హెచ్చరించారు. శుక్రవారం ఆయన రీకన్సిలేషన్ మీటింగ్నిర్వహించి మాట్లాడారు.
ఎన్నికలకు ముందు ఏయే రికార్డు రాయాలో అభ్యర్థులకు వివరించామన్నారు. రోజువారి ఖాతా రిజిస్టర్, నగదు లావాదేవీల రిజిస్టర్, బ్యాంకు రిజిస్టర్, స్టేట్మెంట్ను సీరియల్ ఆర్డర్పద్ధతిలో బిల్స్, ఓచర్లు, ఒరిజినల్ అఫిడవిట్, సంతకం చేసిన బ్యాంక్ స్టేట్మెంట్ను అందజేయాలన్నారు. బ్యానర్లు, పోస్టర్లు, పత్రికలు, టీవీ ఛానల్స్ యాడ్ ఖర్చును రసీదులతో సహా ఇవ్వాలన్నారు. గడవులోగా అందించని వారికి నోటీసు ఇచ్చి అనర్హతకు సిఫార్సు చేస్తామన్నారు. ఎలక్షన్ అబ్వర్వర్లుగా వచ్చిన శక్తి, చిన్మయి ప్రభాకర్, అడిషనల్కలెక్టర్ యాదిరెడ్డి, ఎన్నికల వ్యయ కమిటీ నోడల్ఆఫీసర్ పాపయ్య తదితరులు పాల్గొన్నారు.