రాజీవ్ గాంధీ ​సంస్కరణల సృష్టికర్త

టెలీకమ్యూనికేషన్స్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడు రాజీవ్ గాంధీ. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి, ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘ‌‌న‌‌త ఆయనకే ద‌‌క్కుతుంది. బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ స‌‌మ‌‌స‌‌మాజ స్థాప‌‌న కోసం కృషి చేశారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో అత్యంత పిన్న వయస్సులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు రాజీవ్ గాంధీ.

రాజీవ్​ గాంధీ 1944 ఆగస్టు 20న పుట్టారు. సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడంతో 1980లో  దేశంలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఆ సమయంలో తల్లి ఇందిరాగాంధీని అనేక సవాళ్లు చుట్టుముట్టిన నేపథ్యంలో రాజీవ్​పై రాజకీయాల్లో చేరాల్సిందిగా ఒత్తిడి పెరిగింది. రాజీవ్ మొదట్లో ఇందుకు ఒప్పుకోకున్నా, తర్వాత ఉత్తరప్రదేశ్ లోని అమెథీ నుంచి పోటీ చేసేందుకు ఒప్పుకున్నారు. ఆ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. 1984 అక్టోబర్ 31న ప్రధాని ఇందిర దారుణ హత్యకు గురయ్యారు. దీంతో రాజీవ్ ప్రధానిగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. తల్లి మరణం బాధపెడుతున్నా ఎంతో ఓర్పుతో బాధ్యతలను భుజాలకెత్తుకున్నారు. ప్రధాని అయ్యే సమయానికి ఆయన వయసు 40 ఏళ్లే. దేశ చరిత్రలో అందరి కంటే తక్కువ వయస్సులో ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. ప్రధాని అయ్యాక దేశ చరిత్రలో ఎన్నో కొత్త రికార్డులు నెలకొల్పారు. తల్లి అంత్యక్రియలు పూర్తికాగానే ఆయన లోక్ సభ ఎన్నికలకు ఆదేశించి ఘన విజయం సాధించారు. అంతకుముందు ఏడుసార్లు జరిగిన ఎన్నికల్లో కంటే రాజీవ్ హయాంలో ఎక్కువ సీట్లను సాధించారు.
టెక్నాలజీకి పెద్ద పీట వేసిన్రు
కంప్యూటర్ రంగాన్ని మ‌‌న దేశానికి పరిచయం చేసి ఎంతో మంది విద్యార్థులు సాంకేతిక విద్యను నేర్చుకునేలా చేసింది రాజీవ్ గాంధీనే. గ్రామాల అభివృద్ధికి రాజీవ్ ఎంతగానో కృషి చేశారు. ఐటీ రంగంలో ఈనాడు మనదేశం అగ్రగామిగా ఉందంటే అది రాజీవ్ కృషి ఫలితమే. ఆధునిక భావాలు కలిగిన వ్యక్తిగా.. అంతర్జాతీయంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు రాజీవ్. అంతేకాదు తన నిర్ణయాలను నిర్భయంగా వెల్లడించేవారు. ‘భారతదేశంలో ఐక్యతను కాపాడుకుంటూనే మన దేశ ఐక్యతను 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లడమే’ తన ధ్యేయమని రాజీవ్​ చాలా సార్లు చెప్పారు. సోవియట్ యూనియన్ 'ప్రొటెక్షనిస్ట్ గవర్నమెంట్' విధానాలపై ఆధారపడిన అప్పటి ఆర్థిక నమూనాను విస్తృతం చేసే విధానాలు, సంస్కరణలను ప్రధానిగా రాజీవ్  ప్రవేశపెట్టారు. సాంకేతిక పరిశ్రమపై పన్నులను తగ్గించే సంస్కరణలను ప్రవేశపెట్టారు. టెలీకమ్యూనికేషన్స్, రక్షణ, వాణిజ్య, విమానయాన సంస్థలకు సంబంధించిన దిగుమతి విధానాలను సంస్కరించారు. ఆయన విధానాలు ఆర్థిక వ్యవస్థలో అధిక విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలను ఆధునీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. రాజీవ్  తల్లి ఇందిరలా కాకుండా, సంప్రదాయ సోషలిజానికి వ్యతిరేకంగా ఉంటూ, పాశ్చాత్య దేశాలతో ఆర్థిక, శాస్త్రీయ సహకారాన్ని విస్తరించడం ద్వారా అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచారు.
గ్రామాలకు టెలిఫోన్ల విస్తరణ
రాజీవ్  మనదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలీకమ్యూనికేషన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేశారు. ఇందిర హత్యకు వారం రోజుల ముందు ప్రవేశపెట్టిన పాలసీ ద్వారా సాఫ్ట్‌‌వేర్ ఎగుమతులు ప్రారంభమయ్యాయి. 1984లోనే ఈ విధానాన్ని ఇందిర కేబినెట్ ఆమోదించినా, రాజీవ్ ప్రభుత్వం 1984 నవంబర్ 18న ఈ విధానాన్ని ప్రకటించింది. 1984లో ప్రభుత్వ యాజమాన్యంలోని టెలీకమ్యూనికేషన్స్ టెక్నాలజీ డెవలప్‌‌మెంట్ సెంటర్ అయిన సెంటర్ ఫర్ డెవలప్‌‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ ను ప్రారంభించింది. మొదట్లో ఇది డిజిటల్ ఎక్స్ఛేంజీల రూపకల్పన, అభివృద్ధికి ఉద్దేశించబడింది. రాజీవ్ సలహాదారుగా ఉన్న పిట్రోడా టెలీకమ్యూనికేషన్స్, నీరు, అక్షరాస్యత, రోగనిరోధకత, పాడి, చమురు విత్తనాలకు సంబంధించిన ఆరు టెక్నాలజీ మిషన్‌‌లకు నాయకత్వం వహించారు. దేశంలో టెలీకమ్యూనికేషన్స్ విప్లవాన్ని తీసుకువచ్చిన చాలా మందిలో ఆయన ఒకరు. 1984 ఐటీ పాలసీకి ముందు సాఫ్ట్‌‌వేర్ నిపుణులు పారిశ్రామికవేత్తలుగా గుర్తించబడలేదు. సాఫ్ట్‌‌వేర్ వ్యాపారంగా పరిగణించబడలేదు. ఇది ఈ రంగంలోని ప్రజలను బ్యాంకు రుణాలకు అనర్హులుగా చేసింది. తద్వారా వారికి ప్రారంభ మూలధనం లేకుండా పోయింది. 1984 తర్వాత పిట్రోడా, ప్రభుత్వ సహాయంతో దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్​ల శ్రేణిని నిర్మించి, ఫోన్‌‌లను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. 1986లో ఢిల్లీ, ముంబై టెలిఫోన్ సేవలను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. అదే సంవత్సరంలో విదేశీ సమాచార నెట్‌‌వర్క్ లిమిటెడ్ ను స్థాపించింది.
ఫిరాయింపులకు అడ్డుకట్ట వేశారు
రాజీవ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం 1985లో 52వ రాజ్యాంగ సవరణ చేసింది. రాజ్యాంగం పదో షెడ్యూల్‌‌లో ఫిరాయింపుల నిరోధక చట్టం చేర్చారు. 1973లో మొట్టమొదట ఇందిర ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. కానీ అత్యవసర పరిస్థితి కారణంగా అది అమలు కాలేదు. సవరణ బిల్లు అమలులోకి వచ్చిన తర్వాత దేశ రాజకీయాల్లో ఫిరాయింపులకు ముగింపు పలికినట్లయ్యింది. అయితే అందులో ఉన్న లొసుగుల కారణంగా ఫిరాయింపులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. 
ఎడ్యుకేషన్​ పాలసీ తెచ్చిన్రు
జాతీయ సమైక్యత, సాంస్కృతిక, ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ, కాలేజీ స్థాయిల వరకు విద్యను అందించడం లక్ష్యంగా 1968లో ఇందిర ప్రభుత్వం మొదటి నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ ను ప్రవేశపెట్టింది. అసమానతలను తొలగించడం, విద్యావకాశాల సమానత్వం, ముఖ్యంగా మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ 1986లో రాజీవ్  ప్రభుత్వం కొత్త నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ ను ప్రవేశపెట్టింది. రాజీవ్ ప్రభుత్వం 1986లో ఆపరేషన్ బ్లాక్‌‌బోర్డ్ ను ప్రవేశపెట్టి, 1987లో దానిని ప్రారంభించింది. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు వారి విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడానికి అవసరమైన సంస్థాగత పరికరాలు, బోధనా సామగ్రిని అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించింది. వంద మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలలకు అదనపు ఉపాధ్యాయులకు జీతం ఇవ్వాలనే నిబంధనను ఇందులో చేర్చింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీని 1985లో రాజీవ్ సర్కారు ఏర్పాటు చేసింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ యాక్ట్ 1985ను పార్లమెంట్​ ఆమోదించిన తర్వాత ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ‘దూర, బహిరంగ విద్య’ అందించడానికి ఇది ఏర్పాటైంది.
పొరుగు దేశాలను కాపాడారు  
మాల్దీవుల రిపబ్లిక్‌‌లో మౌమూన్ అబ్దుల్ గయూమ్ ప్రెసిడెన్సీకి వ్యతిరేకంగా 1980లో వరుస తిరుగుబాటు ప్రయత్నాలు జరిగాయి. 1980, 1983లో రెండు ప్రయత్నాల తర్వాత అబ్దుల్లా లుతుఫీ ద్వారా మూడో ప్రయత్నం జరిగింది. గయూమ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జరిగిన ఈ ప్రయత్నాన్ని ఎదుర్కొని మాలెలో పరిస్థితి పునరుద్ధరించడానికి ప్రధాని రాజీవ్ 1,600 పారాట్రూపర్‌‌లను అక్కడికి పంపారు. భారత సైన్యం ప్రెసిడెంట్ గయూమ్‌‌ను రక్షించింది. శ్రీలంక అంతర్యుద్ధంలో రాజీవ్ జోక్యం చేసుకున్నారని భావించిన ఎల్​టీటీఈ తీవ్రవాదులు దారుణంగా హత్య చేశారు. దేశంలోని తమిళ పార్టీల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల రాజీవ్​ శ్రీలంకలోని తమిళులకు సహాయం అందించారు. రాజీవ్ అప్పటి శ్రీలంక అధ్యక్షుడు జయవర్ధనేతో ఇండో-ఎస్ఎల్ ఒప్పందంపై సంతకం చేశారు. అందులో, శ్రీలంకలో పరిస్థితిని అదుపు చేయడానికి, శాంతిని కాపాడే దళాన్ని పంపడానికి ఒక ఒప్పందం కుదిరింది. అయితే 1989లోఅధికారంలోకి వచ్చిన రణసింఘే ప్రేమదాస శ్రీలంక నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని మనదేశాన్ని కోరారు. దీని తర్వాత మనదేశం వెంటనే శ్రీలంక నుంచి వైదొలిగింది. అయినప్పటికీ ప్రతీకారంతో ఉన్న ఎల్​టీటీఈ తీవ్రవాదులు 1991 మే 21న శ్రీపెరంబుదూర్ లో రాజీవ్ ను హత్య చేశారు. ఆయన వర్థంతిని “ఉగ్రవాద నిరోధక దివస్”గా, ఆయన జయంతిని “సద్భావన దివస్” గా ఏటా జరుపుకుంటున్నాం.