ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలి : రాజీవ్ కుమార్

ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలి : రాజీవ్ కుమార్

ఖమ్మం టౌన్, వెలుగు : లోక్ సభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం న్యూఢిల్లీ నుంచి ఆయన ఎన్నికల కమిషనర్లు గ్యానేశ్ కుమార్, డాక్టర్ సుక్ భీర్ సింగ్ సందుతో కలిసి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, ఖమ్మం నూతన కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీపీ గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్​కుమార్​మాట్లాడుతూ జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఉంటుందన్నారు. 

దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తిచేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో ఫలితాలు వెలువరించేందుకు ప్రత్యేకంగా మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలన్నారు.  స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ కు ఈవీఎంల తరలింపునకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. వీవీప్యాట్ లెక్కింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ప్రతి టేబుల్ వద్ద ప్రత్యేక బృందాలను నియమించాలన్నారు. కౌంటింగ్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో​ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, జడ్పీ సీఈవో వినోద్, డీఆర్డీవో సన్యాసయ్య, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, ఆర్ అండ్ బీ ఈఈ శ్యామ్ ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.