రోజులు మారాయ్.. నోటిఫికేషన్ల మధ్య గ్యాప్ ఇవ్వడంటూ ధర్నాలు చేస్తున్నరు: డిప్యూటీ CM భట్టి

రోజులు మారాయ్.. నోటిఫికేషన్ల మధ్య గ్యాప్ ఇవ్వడంటూ ధర్నాలు చేస్తున్నరు: డిప్యూటీ CM భట్టి

హైదరాబాద్: తెలంగాణలో ఒకప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ధర్నాలు జరిగేవి.. కానీ ఇప్పుడు నోటిఫికేషన్ల మధ్య కొంత గ్యాప్ ఇవ్వడంటూ ధర్నాలు జరిగే రోజులు వచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని యువతకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి కల్పించడంపై దృష్టి సారించామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే రాజీవ్ యువ వికాసం స్కీమ్ ప్రారంభించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (మార్చి 17) ప్రారంభించారు. 

అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి, ఎమ్మెల్యేలు కూనంనేని, అక్బరుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ..  గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ల ద్వారా పథకాలు ప్రకటించారు కానీ నిధులు ఇవ్వలేదు.. స్కీములు అమలు చేయలేదని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. 

ALSO READ | ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

గత దశాబ్ధ కాలంలో రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టుల భర్తీ జరగలేదని.. కానీ మేం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే గ్రూప్ 1 పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేశామని పేర్కొన్నారు. టీజీపీఎస్ నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నామన్నారు. యువతకు ఓ వైపు ఉద్యోగాలు కల్పిస్తూనే.. మరోవైపు స్వయం ఉపాధికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ స్వయం ఉపాధికి ఒక్క పథకం కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. 

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కోసమే రాజీవ్ యువ వికాసం పథకం తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పటి వరకు ఎక్కడా ఒకేసారి 5 లక్షల మంది యువతకు రూ.6 వేల కోట్ల రుణాలివ్వలేదన్నారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ ప్రారంభోత్సవ తేదీ నుంచి యువతకు రుణాలు మంజూరు చేసే వరకు పక్కాగా తేదీలు ప్రకటించామని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) రోజున 5 లక్షల మంది యువతకు రుణాలిస్తామని తెలిపారు. రాష్ట్ర యువత భవిష్యత్ కోసమే రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని పునరుద్ఘాటించారు.