
- ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
- ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులకు అవకాశం
- ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు వెరిఫికేషన్
- జూన్ 2న లబ్ధిదారుల ప్రకటన
హైదరాబాద్, వెలుగు: రాజీవ్ యువ వికాసం పథకం ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఎవరైనా ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్ల వెరిఫికేషన్ కొనసాగుతుంది. అర్హులను ఎంపిక చేసి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున (జూన్ 2) లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తారు. ఈ పథకం కింద ఒక్కొక్కరు గరిష్టంగా రూ.3 లక్షల వరకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందవచ్చు.
ఈ పథకం కింద దాదాపు 5 లక్షల మందికి రూ.6 వేల కోట్లతో సబ్సిడీ రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. దీన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అమలు చేయనుంది. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం తదితర వివరాలు ఆయా కార్పొరేషన్ల వెబ్‌సైట్‌లో ఇప్పటికే వెల్లడించారు.
గిరిజనులకు ఐటీడీఏలో దరఖాస్తులు..
ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఐటీడీఏ అధికారులను సంప్రదించాలని గిరిజన సహకార ఆర్థిక సంస్థ తెలిపింది. అర్హులకు కేటగిరీ 1, 2, 3 వారీగా రుణాలు ఇవ్వనున్నట్టు తెలిసింది. కేటగిరీ 1 కింద రూ.లక్ష వరకు రుణాలు అందిస్తారు. ఇందులో 80 శాతం రాయితీ పోను, మిగతా 20 శాతం లబ్ధిదారు భరించడమో లేదా బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడమో ఉంటుంది. కేటగిరీ 2 కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తారు. ఇందులో 70 శాతం రాయితీ ఉంటుంది. కేటగిరీ 3 కింద 60 శాతం రాయితీతో రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తారు.
భట్టి, పొన్నం సమీక్ష..
రాజీవ్ యువ వికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. పథకం విధివిధానాలపై చర్చించారు. నిరుద్యోగ యువతకు ఇదొక సువర్ణ అవకాశమని భట్టి , పొన్నం అన్నారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పరచడానికి ఈ పథకం దోహదపడుతుందన్నారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల చైర్మన్లు ప్రీతం, బెల్లయ్య నాయక్, ఒబేదుల్ల కొత్వాల్ పాల్గొన్నారు.