దళారీల పైరవీలను కట్టడి చేయండి

దళారీల పైరవీలను కట్టడి చేయండి
  • రాజీవ్ యువ వికాసం స్కీం పారదర్శకంగా అమలు చేయాలి
  • నిధుల సమస్య లేదు.. జూన్ 2 నుంచి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు 
  • అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ఆదేశం 
  • స్కీం పర్యవేక్షణ బాధ్యతలు సీనియర్ ఐఏఎస్ కు అప్పగింత 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యువత జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసమే రాజీవ్ యువ వికాసం స్కీంను తెచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ స్కీం అమలులో అధికారులు అంకితభావంతో పని చేయాలన్నారు. శనివారం అసెంబ్లీ కమిటీ హాల్ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి రాజీవ్ యువ వికాసం స్కీం అమలుపై భట్టి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

ఈ పథకానికి నిధుల సమస్య కూడా లేదన్నారు. పథకంలో మధ్య దళారీల పైరవీలు లేకుండా ఎక్కడికక్కడ కట్టడి చేయాలని, లబ్ధిదారుల ఎంపిక చాలా పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయాలని, అప్పటి నుంచి యూనిట్ ఏర్పాటు, వ్యాపారంలో స్థిర పడేంత వరకు కావలసిన సహకారాన్ని అందించాలని చెప్పారు. 

బ్యాంకు మార్జిన్ తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం రూ.9 వేల కోట్లు పెట్టుబడిగా పెడుతున్నదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ శాఖలను సమన్వయం చేస్తూ ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి రాజీవ్ యువ వికాస్ మిషన్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మిషన్ బాధ్యతలు సీనియర్ ఐఏఎస్ అధికారికి అప్పగిస్తున్నట్లు చెప్పారు. శాఖల వారీగా ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షించడానికి కూడా ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించారు. 

ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ.. 

ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 5లోగా దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేసి ఏప్రిల్ 6 నుంచి మూడు వారాల్లో మండల స్థాయిలో లబ్ధిదారుల ఎంపికకు స్క్రూటినీ చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఆ తర్వాత లబ్ధిదారుల జాబితాను జిల్లా కలెక్టర్ కు మండల అధికారులు పంపించాలన్నారు. 

కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ వారం రోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి జిల్లా ఇంచార్జీ మంత్రి అనుమతి కోసం పంపించాలని.. అప్రూవల్ వచ్చిన తర్వాత లబ్ధిదారులను ప్రకటించాలన్నారు. జూన్ 2 నాడు స్వయం ఉపాధి పథకాలకు ఎంపికైన లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు పత్రాలను అందజేయాలన్నారు. సమావేశంలో స్పెషల్ సీఎస్​లు రామకృష్ణారావు, జయేశ్ రంజన్, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర అధికారులు పాల్గొన్నారు.