అమితాబ్ బచ్చన్.. షారుక్ ఖాన్‌లాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ పాపులారిటీ తెచ్చుకున్నాడు రాజ్ కుమార్ రావ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన రాజ్ చదువులో, మిగతా యాక్టివిటీస్‌లో చురుకుగా ఉండేవాడు. స్కూల్ చదువు పూర్తికాకముందే సినిమాల మీదకి మనసు మళ్లింది. ఇండస్ట్రీలో తెలిసినవాళ్లు ఎవరూ లేరు. అయితేనేం... ‘షారుక్ ఖాన్ కూడా సొంతంగా కష్టపడి ఎదిగాడు కదా. మరి నేనెందుకు మరో షారుక్ కాకూడదు?’ అనుకున్నాడు. అంతే... అదే లక్ష్యంతో ఢిల్లీలోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరాడు. ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకులు.. ఎత్తుపల్లాలు చూశాడు. ఫైనల్లీ అనుకున్నది సాధించిన ఇన్స్పైరింగ్ జర్నీఇది...
‘‘హర్యానాలోని గుర్గావ్ మా ఊరు. గురుగ్రామ్ అని కూడా పిలుస్తారు. అక్కడ1984, ఆగస్ట్ 31న పుట్టా. మా నాన్న సత్య ప్రకాశ్ యాదవ్. హర్యానా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్లు. అమ్మ పేరు కమ్లేశ్ యాదవ్. తను హోం మేకర్. చిన్నప్పుడు నేను బాగా చదువుకునేవాడ్ని. అలాగే స్కూల్లో, కాలేజీల్లో జరిగే కల్చరల్ యాక్టివిటీస్‌లో పాల్గొనేవాడ్ని.
సినిమాల్లో చూసిన ఫైట్స్ మా అన్న, నేను ఒకరిమీద ఒకరం సరదాగా చేసేవాళ్లం. అలా ఒకసారి చేస్తుంటే... ‘ఒకతను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటావా?’ అని అడిగాడు. వెంటనే ‘నేర్చుకుంటా’ అని చెప్పా. ఆయనెవరో కాదు.. ప్రొఫెషనల్ తైక్వాండో మాస్టర్ యామిన్. అప్పటి నుంచి దాదాపు పన్నెండేళ్లు ఆయన దగ్గరే నేను తైక్వాండో నేర్చుకున్నా. అలా నా లైఫ్‌లోకి మార్షల్ ఆర్ట్స్ వచ్చింది. ప్రొఫెషనల్‌గా ఫైట్స్ చేసి మెడల్స్ కూడా గెలుచుకున్నా.
మొదటి సంపాదన
జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని మెడల్స్ గెలిచాక ‘మార్షల్ ఆర్ట్స్ ఇక చాలు. ఇంకేదైనా నేర్చుకోవాలి’ అనుకున్నా. అప్పుడు డాన్స్ మీదకి దృష్టి మళ్లింది. అది కూడా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్లో డాన్స్ టీచర్స్ నేర్పించేవాళ్లు. ‘బాగా డాన్స్ చేస్తావ’ని అందరూ నన్ను గుర్తించడం నాకు చాలా నచ్చేది. నేను వాళ్లందరికీ స్పెషల్‌గా కనిపిస్తుంటే ఆ ఫీల్ ఎంజాయ్ చేసేవాడిని. స్కూల్లో ప్రోగ్రామ్స్ జరిగితే గ్రూప్ డాన్స్ చేసేవాళ్లం. ఎనిమిదో తరగతి చదివేటప్పుడు పిల్లలకు డాన్స్ ట్యూషన్స్ చెప్పేవాడిని.
ఒక చిన్న పాపకి వాళ్ల ఇంటికి వెళ్లి మరీ డాన్స్ నేర్పించా. అప్పుడు వాళ్లు నాకు 300 రూపాయలు ఇచ్చారు. అదే నా మొదటి సంపాదన. దాంతో నేను మా ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చా. మిగిలిన డబ్బులు తీసుకెళ్లి మా పేరెంట్స్‌కి ఇచ్చా. ఆ రోజు నాకు కలిగిన ఫీలింగ్ లైఫ్లో మర్చిపోలేను. ఎవరెవరికో ఎన్నో గిఫ్ట్‌లు ఇచ్చి ఉండొచ్చు. కానీ, ఆ రోజు మా అమ్మకి ఆ డబ్బులు ఇవ్వడంలో చాలా సంతోషంగా ఫీలయ్యా.
అప్పుడే యాక్టింగ్ కూడా...
యాక్టింగ్ విషయానికొస్తే... తొమ్మిది, పది తరగతులు చదివేటప్పుడు సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సినిమా చూస్తున్నప్పుడు ఇన్వాల్వ్ అయ్యేవాడిని. చెప్పాలంటే.. ‘అగ్నిపత్’ సినిమాలో అమితాబ్ బచ్చన్ బాగా దెబ్బలు తిని చనిపోయే స్టేజ్‌లో ఉంటే అది చూసి ఎమోషనల్ అయ్యి.. ‘దేవుడా ఆయన్ని బతికించు’ అని నిజంగా వేడుకున్నా. అంత కనెక్ట్ అయిపోయేవాడిని. అలా సినిమాలు చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యా. ఆ యాక్టర్స్‌తో కలిసి నటించాలి అనుకునే వాడిని. గుర్గావ్లో ఊరి బయట షూటింగ్ జరుగుతుంటే, చూడ్డానికి ఫ్రెండ్స్‌తో కలిసి సైకిల్స్ మీద వెళ్లాం. షూటింగ్ జరిగే విధానం, వాళ్ల అరుపులు చూసి నాకు గూస్బంప్స్ వచ్చేశాయి.
టెన్త్‌లోనే ఆడిషన్‌కి వెళ్లా
పదో తరగతి చదివేటప్పుడు పేపర్లో టీవీలో ఆడిషన్స్ జరుగుతున్నాయనే యాడ్ చూశా. అప్పటికి టీవీకి, సినిమాకి డిఫరెన్స్ తెలియదు. వెంటనే అక్కడికి వెళ్లా.. వాళ్లు నాకు ఫొటోలు తీసి పంపించారు. తర్వాత ‘సెలక్ట్ అయ్యావ’ని ఫోన్ చేశారు. అప్పుడు ‘లైఫ్ సెట్ అయిపోయింది’ అనుకున్నా. కానీ అక్కడికి వెళ్లి చూస్తే ఆ అడ్రెస్లో ఆఫీస్ లేదు. డిజప్పాయింట్ అయి ఇంటికొచ్చేశా. టెలివిజన్ ఛాన్స్ అలా అయ్యేసరికి.. ఇక లాభం లేదు ముంబై వెళ్లాల్సిందే అనుకున్నా. నా తమ్ముడితో కలిసి ట్రైన్ ఎక్కి ముంబై వెళ్లిపోయాం. ఆడిషన్ కూడా ఇచ్చాం. అందులో సెలక్ట్ కాలేదు. ఆ జర్నీలో రెండు రాత్రులు రైల్వే స్టేషన్లోనే పడుకున్నాం. అప్పటికి నేను ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్.
ఆ తర్వాత ఢిల్లీలో డిగ్రీ చదవడానికి వెళ్లా. అక్కడ చదువుకుంటూనే నాటకాలు నేర్చుకోవడానికి ఇనిస్టిట్యూట్‌లో చేరా. ఆ తర్వాత యాక్టింగ్ మీద నాకున్న అభిప్రాయం మారింది. ఎవరి సినిమా చూసినా వాళ్ల క్యారెక్టర్ నేను చేస్తే ఎలా ఉంటుంది? అనుకునేవాడిని. చిన్నప్పుడు షారుక్ ఖాన్ని చూసి తనలా అవ్వాలనుకునేవాడ్ని. ఆయన యాక్టింగ్, జర్నీ చూసినప్పుడు ఇన్స్పైరింగ్గా అనిపించేది. ఆయన కూడా స్టేజ్ యాక్టింగ్ నుంచే యాక్టర్ వరకు ఎదిగాడు. ఆయన సాధించినప్పుడు నేనెందుకు ప్రయత్నించకూడదు? అనుకునేవాడ్ని.
అది నా మొదటి అవకాశం
నా బైక్‌ని ఢిల్లీ నుంచి పుణెకి ట్రైన్లో తెప్పించుకున్నా. 2008లో నేను పుణె నుంచి ముంబైకి బైక్ మీద వెళ్లా. ఆడిషన్స్ కోసం నాలుగేండ్లు దానిమీదే తిరిగా. ఆ టైంలో రోజుకొక కాస్టింగ్ డైరెక్టర్ని కలిసేవాడిని. ఆ రోజు వాళ్లతోనే గడిపేవాడిని. వాళ్లకు నా గురించి చెప్పి, నా పోర్ట్ ఫోలియో చూపించేవాడిని. నాకు తెలిసిన యాక్టింగ్ స్కిల్స్ అన్నీ చేసి చూపించేవాడిని. ఒక ఏడాదిన్నర టైంలో చాలామంది కాల్ చేశారు. ఆడిషన్ తీసుకునేవారు.. ‘చిన్న రోల్ ఇది.
జస్ట్ అలా తెరపై కనిపించి వెళ్లిపోతుంది సీన్’ అనేవాళ్లు. లేదంటే యాభై మందిలో ఒకరిగా నిల్చోవాలి అని చెప్పేవాళ్లు. ముంబై వచ్చాక నేను ఫస్ట్ ఆడిషన్లో సెలక్ట్ అయ్యా. అది హెచ్డీఎఫ్సీ యాడ్. అందులో సెలక్ట్ కాగానే ‘ఇక లైఫ్ కూడా సెట్ అయిపోయింది’ అనుకున్నా ఆ క్షణం. కానీ, ఆ తర్వాత నుంచి మళ్లీ మామూలే. అవకాశాలు లేక ఖాళీగా ఉన్నా. అప్పుడు మా అమ్మ చాలా సపోర్ట్ చేసింది. అందుకే నేను నా మీద ఉన్న నమ్మకం ఎప్పుడూ కోల్పోలేదు.
నాకు తెలిసిందల్లా కష్టపడటమే
అకౌంట్లో డబ్బులు లేనప్పుడు చాలా డిజప్పాయింట్ అయ్యేవాడిని. బాధపడేవాడిని. కానీ, నాకు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్లు. వాళ్లను ఎవరిని అడిగినా వెంటనే డబ్బు పంపేవాళ్లు. ఒకరికొకరం సాయం చేసుకునేవాళ్లం. కొంతమంది వాళ్లదగ్గరికి రమ్మని పిలిచేవాళ్లు. అందరం కలిసి ఫుడ్ షేర్ చేసుకునేవాళ్లం. కొన్ని సీన్స్ రిహార్సల్స్ చేసేవాళ్లం. అలా నా మైండ్ ఎప్పుడూ యాక్టింగ్ మీదే ఉండేది. ఎంత బాధలో ఉన్నా, ఆల్కహాల్, సిగరెట్ వంటి వాటి జోలికి పోలేదు. చదువుకునే రోజుల్లో గుర్గావ్ నుంచి ఢిల్లీకి డైలీ తిరిగేవాడ్ని. నేనెప్పుడూ కష్టాలకు భయపడలేదు.
సినిమా కెరీర్
నా మొదటి సినిమా ఎల్.ఎస్.డి.(2010). ఆ సినిమాకి నాకు11వేల రూపాయలు రెమ్యూనరేషన్. మూడు కథల్లో నేను ఒక కథకి సెలక్ట్ అయ్యా. ఆ సినిమా కోసం ఒక నెలలో ఆరు కిలోలు బరువు కూడా తగ్గా. ఆ సినిమా హిట్ అయింది. నా పర్ఫార్మెన్స్కి ప్రశంసలు వచ్చాయి. దాని తర్వాత ‘రాగిణి ఎం.ఎం.ఎస్.’లో అవకాశం వచ్చింది. మొదట ఒప్పుకున్నా. కానీ, అది కూడా ఫస్ట్ సినిమాలో క్యారెక్టర్లానే ఉంది అనిపించింది. అయినా ఆ సినిమా కాస్టింగ్ డైరెక్టర్ అతుల్ మంగొనియా పట్టుబట్టడంతో చేయక తప్పలేదు. ఆ సినిమాకి లక్ష రూపాయల రెమ్యూనరేషన్. ఒక్కసారిగా అంత డబ్బు చూసి నమ్మలేకపోయా. ఆ సినిమా సక్సెస్ అయింది. ఆ తర్వాత వరుసగా ‘సైతాన్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్’, ‘తలాష్ : ది ఆన్సర్ లైస్ వితిన్’ సినిమాల్లో నటించా.
అయితే... ఫస్ట్ మూవీని అది నాకు పేరు తెస్తుందని చేయలేదు. దివాకర్ బెనర్జీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నా. ఈ సినిమా చేస్తే ఆడియెన్స్ సంగతి ఏమో గానీ, ఫిల్మ్ మేకర్స్ కచ్చితంగా చూస్తారు. వాళ్లకు ఏదైనా క్యారెక్టర్లో నేను చేస్తే బాగుంటుంది అనిపిస్తే అవకాశాలు వస్తాయి కదా అనుకున్నా. అనుకున్నట్టు ఫిల్మ్ మేకర్స్ చూడడం వల్ల ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్’లో అవకాశం వచ్చింది. అది చేస్తున్నప్పుడు ముకేశ్, అనురాగ్ కశ్యప్‌లు హన్సల్కి నా పేరు సజెస్ట్ చేయడంతో ‘షాహిద్’లో అవకాశం వచ్చింది.
- సిటీ లైట్స్ (2014), ఒమెర్టా (2018) సినిమాలు నా పర్సనల్ లైఫ్‌ని ప్రభావితం చేశాయి.
- సిటీలైట్స్ సినిమాలో నాతో నటించిన పత్రలేఖనే 2022లో పెండ్లి చేసుకున్నా.
- రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో 2010లో వచ్చిన ‘రన్’ అనే సినిమాలో న్యూస్ రీడర్‌గా కనిపించా.
- మొదటి నుంచి ఫేమ్, డబ్బు సంపాదించాలనే ఆలోచన నాకు లేదు. ఒక మంచి సినిమాలో నటించాలి అనే ప్యాషన్‌తో పనిచేశా. అలానే చేస్తున్నా కూడా.
- నటనంటే కథలో ఇన్వాల్వ్ అయి, క్యారెక్టర్‌తో జర్నీ చేయాలి. నువ్వే ఆ పాత్ర అయితే ఎలా చేస్తావ్? అని ప్రశ్నించుకోవాలి. నేను అదే చేస్తా.