యాదాద్రి, వెలుగు: ప్రధాని మోదీ భారత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచలోనే మూడో ఆర్థిక శక్తిగా నిలిపారని కేంద్ర విద్యుత్, ఇందన శాఖ మంత్రి రాజ్కుమార్సింగ్కొనియాడారు. ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’లో భాగంగా శనివారం యాదాద్రి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదేండ్లలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు.
బీజేపీ పాలనలో ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్లు, తాగునీరు అందించామని తెలిపారు. ఇల్లు లేని కుటుంబం ఉండకూడదన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు 3 కోట్ల ఇండ్లను నిర్మించి ఇచ్చామన్నారు. కోవిడ్ సమయంలో ప్రారంభించిన ఫ్రీ రేషన్ స్కీంను ఇంకా కొనసాగిస్తున్నామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ. 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించడంతో పాటు జన ఔషధ కేంద్రాలను ప్రారంభించామని గుర్తు చేశారు.
ప్రతీ పేదవాడికి వైద్య సాయం అందించాలనే సంకల్పంతో ఎయిమ్స్ సేవలు విస్తృతం చేశామని, ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ నిర్మాణమే లక్ష్యమన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని, భారత్‌ను ప్రపంచంలోనే బలమైన శక్తిగా మలచడమే తమ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా 20 మహిళా సంఘాలకు రూ. మూడు కోట్ల రుణాలను అందించారు.
ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేశ్ కుమార్, కెనరా బ్యాంక్ ఏజీఎం శాంతి కుమార్, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ జనరల్ మేనేజర్ ప్రపుల్ల కుమార్, ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బిపిన్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామకృష్ణ, పప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.