
జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టుల చనిపోవటం, ఉగ్రవాదుల కిరాతకంపై సీరియస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. ఇందులో భాగంగానే భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హై లెవల్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు.
NIA జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తోపాటు.. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ మార్షల్ దినేష్ త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ లతో కీలక సమావేశం నిర్వహించారు రాజ్ నాథ్ సింగ్. త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు అందరూ ఈ భేటీలో పాల్గొన్నారు.
జమ్మూ కాశ్మీర్ లో జరిగిన తీవ్రవాదుల దాడితోపాటు జమ్మూ కాశ్మీర్ లోని భద్రతను సమీక్షించారు. ఉగ్రదాడి తర్వాత తీసుకున్న భద్రత చర్యలను వివరించారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఉగ్రదాడి తర్వాత జమ్మూకాశ్మీర్ కు ఉన్నతాధికారుల బృందాలతోపాటు, అదనపు బలగాలను తరలించినట్లు వివరించారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆపరేషన్ జరుగుతుందని.. అనుమానిత ప్రాంతాలపై నిఘా పెంచామని స్పష్టం చేశారు ఆర్మీ చీఫ్ జనరల్. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని.. భద్రతా దళాల పర్యవేక్షణలో రక్షణ చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు ఆర్మీ అధికారులు.. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రానికి భరోసా ఇచ్చారు ఆర్మీ అధికారులు.
ఉగ్రవాదుల ఏరివేత క్రమంలో ఎదురయ్యే వ్యతిరేక, విధ్వంస పరిస్థితులను సైతం ఎదుర్కోవటానికి ఆర్మీ ఉన్నతాధికారులు జమ్మూకాశ్మీర్ లోనే ఉన్నారని ఆర్మీ చీఫ్ జనరల్ ఈ సమావేశంలో వివరించారు.
త్రివిధ దళాల ఉన్నతాధికారుల సమావేశం తర్వాత జరగబోయే కేబినెట్ సబ్ కమిటీలో మరింత చర్చించి.. తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు.