
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్ పై జరిమానా విధించబడింది. వాంఖడే వేదికగా సోమవారం (ఏప్రిల్ 7) ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా పటిదార్ కు రూ.12 లక్షల రూపాయల ఫైన్ వేశారు. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న నాలుగో కెప్టెన్ గా నిలిచాడు. అంతకముందు హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రియాన్ పరాగ్ స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్నారు.
పటిదార్ నిర్ణీత సమయం లోపు ఇన్నింగ్స్ ను పూర్తి చేయలేకపోయాడు. ముంబై బ్యాటింగ్ ఛేజింగ్ చేస్తున్న సమయంలో రెండో ఇన్నింగ్స్ 105 నిమిషాలకు పైగా కొనసాగింది. 222 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ బౌలింగ్ ప్రణాళికలు, ఫీల్డింగ్ సెట్ చేయడంలో ఎక్కువ సమయం తీసుకుంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ పాలక మండలి కొన్ని మార్పులు చేసింది. స్లో ఓవర్ రేట్ వేసిన కెప్టెన్లకు జరిమానా విధించబడదు. అయితే కెప్టెన్లకు డీమెరిట్ పాయింట్లు ఇస్తారు. ఇవి మూడు సంవత్సరాల పాటు కొనసాగుతాయి.
ఈ మ్యాచ్ లో బ్యాటర్ గా పటిదార్ అదరగొట్టాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఆర్సీబీ కెప్టెన్ ఓవరాల్ గా 32 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. పటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో పాటు విరాట్ కోహ్లీ (67) హాఫ్ సెంచరీ చేయడంతో ముంబై ఇండియన్స్ పై 12 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్ లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులకు పరిమితమైంది.
Rajat Patidar has been fined 12 Lakhs for the slow Over-rate against Mumbai Indians. 🏆 pic.twitter.com/sDZjWXZQ9i
— Johns. (@CricCrazyJohns) April 8, 2025