మోకిల పోలీసుల ముందుకు కేటీఆర్ బామ్మర్ది రాజ్‌ పాకాల

మోకిల పోలీసుల ముందుకు కేటీఆర్ బామ్మర్ది రాజ్‌ పాకాల

హైదరాబాద్: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల మోకిల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీసులు జారీ చేసిన నోటీసులపై రెండ్రోజుల్లో స్పందించాలని రాజ్ పాకాలను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈలోగా ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మోకిల్లా ఎస్‌హెచ్‌వో, ఎస్సైలకు ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ కేసుకు సంబంధించి పోలీసులు చట్ట ప్రకారం ముందుకెళ్లవచ్చునని కోర్టు తెలిపింది. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ రాజ్ పాకాల సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతో కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అందులో ఆరోపించారు.

ఈ పిటిషన్ పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డి విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.మయూర్‌రెడ్డి వాదిస్తూ.. పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను రాజకీయంగా, వ్యక్తిగతంగా దెబ్బతీయడానికే ఆయన బామ్మర్ది రాజ్ పాకాలపై కేసు పెట్టారని, రాజ్ పాకాల ఇటీవల జన్వాడలోని ఇంటికి మారారని కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా బంధువులు, సన్నిహితులకు పార్టీ ఇచ్చారని, అందులో పిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారని తెలిపారు. 

పోలీసులు ఆరోపిస్తున్నట్టుగా పార్టీలో ఎలాంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు లేవని, పిటిషనర్‌తో సహా అందరి మూత్రం శాంపిల్స్‌ను పోలీసులు తీసుకున్నారని, ఎలాంటి ఆధారాలు లభించలేదని రాజ్ పాకాల తరపు న్యాయవాది వాదించారు.

ALSO READ ; విజయ్ మద్దూరి ఇంట్లో పోలీసుల సోదాలు

పోలీసులు ఈ వాదనపై స్పందించారు. ఎలాంటి రాజకీయ దురుద్దేశంతో కేసు నమోదు చేయలేదని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపారు. ‘‘పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించాల్సిన బాధ్యత పిటిషనర్‌పై ఉంది. మద్దూరి విజయ్‌ అనే వ్యక్తి మూత్రాన్ని పరీక్షిస్తే, డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్‌ వచ్చింది. పిటిషనర్‌కు విజయ్‌ సన్నిహితుడు. అతను వెల్లడించిన వివరాల మేరకే కేసు నమోదు చేశాం. కొకైన్‌ వినియోగించినట్టు ఆధారాలు ఉన్నాయి. ఈ కేసులో లోతుగా విచారణ జరపాల్సి ఉంది. చట్టప్రకారమే ముందుకెళ్తాం. అనుమానితులకు కూడా నోటీసులు జారీ చేస్తాం” అని చెప్పారు.