కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి కేసు : నిందితుడికి 14 రోజుల రిమాండ్

మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి కేసు వివరాలను సిద్దిపేట సీపీ శ్వేత వివరించారు. అక్టోబర్ 30వ తేదీన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిందని వివరించారు. ఈ సమయంలో అక్కడున్న ప్రజలు దాడి చేసిన వ్యక్తిని కొట్టారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో తాము అన్ని ఆధారాలు సేకరించామన్నారు. దాడి చేసిన వ్యక్తి రాజు పలు న్యూస్ ఛానల్ లో రిపోర్టర్ గా పని చేస్తున్నాడని చెప్పారు. వారం క్రితం కత్తిని కొనుగోలు చేసి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేయాలని ప్లాన్ చేసుకున్నాడని చెప్పారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ శ్వేత మాట్లాడారు. 

నిందితుడు రాజును బుధవారం ( నవంబర్ 1న) కోర్టు ముందు హాజరు పరిచారు. రాజుకు జడ్జి 14రోజుల రిమాండ్ విధించారు. నిందితునికి ఇంకా ఎవరైనా సహకారం చేశారా..? లేదా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నామని సీపీ శ్వేత చెప్పారు. సోషల్ మీడియాలో ఎవరూ విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టవద్దని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నిందితుడు రాజు సెన్సేషనల్ క్రియేట్ చేయడానికే ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీపీ శ్వేత చెప్పారు. 

ALSO READ :- కాంగ్రెస్ లో చేరిన వివేక్, కుమారుడు వంశీకృష్ణతో కలిసి పార్టీలో జాయిన్