నిజామాబాద్ లో ఏసీబీకి చిక్కిన ఇందూర్​ ఆర్ఐ

నిజామాబాద్ లో ఏసీబీకి చిక్కిన ఇందూర్​ ఆర్ఐ
  •     ల్యాండ్ రికార్డు సరిచేయమని అడిగినందుకు లంచం డిమాండ్​
  •     రూ.8 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్​ సౌత్​ తహసీల్​ఆఫీస్​లో ఆర్ఐగా పనిచేస్తున్న రాజు గురువారం ఏసీబీకి చిక్కాడు. భూ రికార్డు సరిచేయాలని కోరిన రైతు నుంచి రూ.8 వేల లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా దొరికాడు. నగరానికి చెందిన బంటు రామరాజు అనే రైతుకు చెందిన సర్వే నంబర్​లోని 16 గుంటల భూమి..ధరణిలో గవర్నమెంట్​ల్యాండ్​గా నమోదైంది. తన పట్టాభూమిని నిషేధిత జాబితా నుంచి తీసేయాలని రామరాజు ఆర్ఐ రాజును సంప్రదించగా రూ.20 వేలు డిమాండ్​చేశారు. ఆర్ఐ వద్ద ప్రైవేటు సహాయకుడిగా పనిచేసే హరీశ్​ఈ ఇద్దరి మధ్య బేరం కుదిర్చాడు.

రెవెన్యూశాఖ తప్పిదాన్ని సరిచేయమని కోరగా, లంచం అడుగుతున్నారని పట్టాదారు​ రామరాజు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల ప్రకారం..రూ.8 వేల నగదును కవర్​లో పెట్టి ఆర్ఐకి ఇవ్వగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్​కుమార్, సీఐ నగేశ్​నేతృత్వంలో రైడ్​చేశారు. నగదు స్వాధీనం చేసుకొని తహసీల్దార్​ఆఫీసులో సోదాలు చేశారు. ఆర్ఐ రాజు, అతడి ప్రైవేట్​సహాయకుడు హరీశ్​పై కేసు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ అనిల్​కుమార్​తెలిపారు.

ALSO READ :  అఫిడవిట్​ ఖర్చులపై నజర్

నాలుగేండ్ల కింద సౌత్​తహసీల్దార్​ఆఫీసులో ఆర్ఐగా చేరిన రాజుపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ఒక రాజకీయ నేత అండతో ఆఫీసర్లను లెక్కచేయకుండా పనిచేశారన్న ప్రచారం జరిగింది. ఆయనను ట్రాన్స్​ఫర్​ చేయాలని ఆర్డీవో సహా తహసీల్దార్​కలెక్టర్​ను కోరడం గమనార్హం.