మళ్లీ ధన్​ఖడ్ వర్సెస్ ఖర్గే: రాజ్యసభలో చైర్మన్, ప్రతిపక్ష నేత మధ్య కొనసాగిన వాగ్వాదం

మళ్లీ ధన్​ఖడ్ వర్సెస్ ఖర్గే: రాజ్యసభలో చైర్మన్, ప్రతిపక్ష నేత మధ్య కొనసాగిన వాగ్వాదం

న్యూఢిల్లీ: రాజ్యసభలో శుక్రవారం కూడా గందరగోళం నెలకొన్నది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై అటు అధికార, ఇటు ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఉప రాష్ట్రపతిపై అవిశ్వాస తీర్మానం ఇచ్చి దేశాన్ని, ఉప రాష్ట్రపతిని, రైతులను ఇండియా కూటమి కించపరిచిందని బీజేపీ ఫైర్ అయింది.

రూల్స్ ప్రకారం 14 రోజుల తర్వాతే చర్చ చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంది. బీజేపీ సభ్యులకే చైర్మన్ ఎక్కువ టైమ్ ఇస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాల్సిందేనని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం నడిచింది. ఓవైపు ఖర్గే మాట్లాడుతుండగానే సభను చైర్మన్ సోమవారానికి వాయిదా వేశారు. 

నాపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు.. 

ప్రతిపక్ష సభ్యులు తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని జగదీప్ ధన్ ఖడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నాపై ప్రతిరోజు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఇది నాపై జరుగుతున్న ప్రచారం కాదు.. నా కేటగిరీపై జరుగుతున్న ప్రచారం. నేను రైతు కొడుకును.  బలహీనుడిని కాను. రైతు కొడుకు ఎందుకు ఈ సీట్లో కూర్చున్నాడని మీరు ప్రతిరోజు ఆలోచిస్తున్నారు. అందుకే ఇలా చేస్తున్నారు. ఇందుకు నాకు చాలా బాధగా ఉంది” అని భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మీరు నాపై అవిశ్వాస తీర్మానం ఇచ్చారు.

అది మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ మీరు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం లేదు. ప్రెస్ మీట్ లో నాపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. అది సరికాదు. రూల్స్ ప్రకారం 14 రోజుల తర్వాతే అవిశ్వాస తీర్మానంపై చర్చకు అవకాశం ఉంటుంది. కానీ మీరు అప్పటివరకు ఆగడం లేదు. నాపై వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు” అని అన్నారు. ‘‘ఇక ఈ సమస్యకు స్వస్తి పలుకుదాం. రాజ్యసభ లీడర్ నడ్డా, ప్రతిపక్ష నేత ఖర్గేకు విజ్ఞప్తి చేస్తున్నా.. మీరు నా చాంబర్ కు రండి.. సమస్యను పరిష్కరిద్దాం’’  అని సూచించారు. 

మమ్మల్ని అవమానిస్తున్నారు.. 

రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ కామెంట్లపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. ‘మీరు (ధన్ ఖడ్) మమ్మల్ని అవమానిస్తుంటే, మీకు మేం ఎలా గౌరవం ఇస్తాం?’  అని ఆయన ప్రశ్నించారు. ‘‘మీరు రైతు కొడుకు అయితే నేను కూలీ కొడుకును. నేను మీ కంటే ఎక్కువ కష్టాలు పడ్డాను. మీరు మా పార్టీని, మా పార్టీ లీడర్లను అవమానిస్తున్నారు. మేం ఇక్కడికి మీ ప్రార్థనలు వినడానికి రాలేదు.. చర్చ కోసం వచ్చాం” అని అన్నారు. ‘‘రాజ్యసభ చైర్మన్ బీజేపీ ఎంపీలను ప్రోత్సహిస్తున్నారు. సభలో మాట్లాడేందుకు వాళ్లకే అవకాశం ఇస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనివ్వడం లేదు” అని మండిపడ్డారు. 

హైకోర్టు జడ్జిపై అభిశంసన తీర్మానం.. 

అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ పై రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఇటీవల వీహెచ్ పీ సభలో మాట్లాడుతూ మైనార్టీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై జడ్జెస్ (ఎంక్వైరీ) యాక్ట్ 1968, ఆర్టికల్ 218 కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు అభిశంసన నోటీస్ ను శుక్రవారం రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు అందజేశారు. ఈ తీర్మానంపై 55 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. వీరిలో కపిల్ సిబల్, దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్, చిదంబరం, రణదీప్ సూర్జేవాలా, ప్రమోద్ తివారీ, రాఘవ్ చద్దా, రేణుకా చౌదరి తదితరులు ఉన్నారు.