రాజ్యసభలో అదానీ అవినీతి అంశంపై రచ్చ నెలకొంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్ చేయటం సభలో గందరగోళానికి దారి తీసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అదానీ అంశం గురించి ప్రస్తావించారు.. మోడీ అదానీకి మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు ఖర్గే. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సభలో పరిస్థితి ఎంతసేపటికి అదుపులోకి రాకపోవటంతో సభను బుధవారానికి ( నవంబర్ 27, 2024 ) వాయిదా వేశారు చైర్మెన్.
డిసెంబర్ 20 వరకు జరగనున్న శీతాకాల సమావేశాల్లో వక్స్ బోర్డు సవరణ బిల్లు సహా 16 బిల్లులను ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం.
ఇదిలా ఉండగా.. మణిపూర్ హింస, అదానీ అవినీతిపై యూఎస్ అరెస్ట్ వారెంట్, ఢిల్లీలో వాయు కాలుష్యం వంటి కీలక అంశాలపై మోడీ సర్కార్ పై ప్రశ్నాస్త్రాలు సంధించనుంది ప్రతిపక్షం.
Also Read :- దేశ అభివృద్ధిపై చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నా
గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీతోపాటు మరో ఆరుగురికి కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందడం కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్ గఢ్, తమిళనాడు, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన గుర్తుతెలియని అధికారులు, వ్యక్తులకు రూ. 2 వేల 200 కోట్ల లంచాలు ఇచ్చినట్లు కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి.