అమరావతి: వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఎంపీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్కడ్కు వీరిద్దరూ ఇవాళ (గురువారం) రిజైన్ లెటర్స్ సమర్పించారు. తాజాగా వీరి రాజీనామాలకు చైర్మన్ ధన్కడ్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఏపీలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినట్టు చైర్మన్ కార్యాలయ అధికారులు బులెటిన్ విడుదల చేశారు. రెండు సీట్లు ఖాళీ అయినట్లు చైర్మన్ నోటిఫై చేయడంతో త్వరలోనే ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలాబలాల ప్రకారం చూసుకుంటే ఈ రెండు స్థానాలు అధికార ఎన్డీఏ కూటమికి దక్కడం లాంఛనమే.
అసెంబ్లీలో అధికార ఎన్డీఏ కూటమికి 164 మంది సభ్యుల బలంగా ఉండగా.. ప్రతిపక్ష వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ లెక్క ప్రకారం ఇప్పటి వరకు వైసీపీ ఖాతాలో ఉన్న ఈ రెండు సీట్లు ఎన్డీఏ కూటమికి దక్కనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసీపీకి తాజా పరిణామం మరో భారీ ఎదురు దెబ్బగానే చెప్పవచ్చు. మొన్నటి వరకు రాజ్యసభలో అధికార ఎన్డీఏ కూటమికి బిల్లుల ఆమోదానికి సంపూర్ణ మెజారిటీ లేదు. దీంతో వైసీపీ, జేడీయూ వంటి న్యూట్రల్ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి.
తాజా పరిణామంతో పెద్దల సభలో వైసీపీకి బలం తగ్గనుండగా.. అధికార ఎన్డీఏ కూటమి మరింత స్ట్రెంత్ పెంచుకోనుంది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరణ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తి ఉన్న మోపిదేవి, బీదమస్తాన్ రావు వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటుగా పార్టీ నుండి లభించిన పదవులకు సైతం రాజీనామా చేశారు. త్వరలోనే వీరిద్దరూ అధికార ఎన్డీఏ గూటికి చేరనున్నట్లు ఏపీ పొలిటికల్ సర్కి్ల్స్ లో ప్రచారం జరుగుతోంది. చేరికలకు సంబంధించి ఇప్పటికే చర్చలు కంప్లీట్ అయ్యాయని.. ఇక కండువాలు కప్పుకోవడమే తరువాయి అని టాక్.