ఎమర్జెన్సీపై షా కమిషన్ రిపోర్ట్ కోరిన రాజ్యసభ చైర్మన్

ఎమర్జెన్సీపై షా కమిషన్ రిపోర్ట్ కోరిన రాజ్యసభ చైర్మన్

న్యూఢిల్లీ :  దేశంలో 1975 నాటి ఎమర్జెన్సీ సమయంలో జరిగిన దారుణాలపై దర్యాప్తు చేసి షా కమిషన్ ఇచ్చిన రిపోర్టు కాపీని సభలో ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్​ఖడ్ శుక్రవారం కేంద్రాన్ని కోరారు. ఆ రిపోర్టును బయటపెట్టాలన్న బీజేపీ సభ్యుల డిమాండ్​ను పరిగణనలోకి తీస్కోవాలని, దాంతో పార్లమెంట్ సభ్యులకు, ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని రాజ్యసభ జీరో అవర్ సెషన్​లో సూచించారు.

కాగా, రిజర్వేషన్ల అంశంపై ట్రెజరీ, విపక్ష సభ్యుల మధ్య  వాగ్వాదం జరగడంతో శుక్రవారం   రాజ్యసభ గంటపాటు వాయిదాపడింది. తిరిగి సభ ప్రారంభం కాగానే, 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారికి 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆఫీస్ మెమోరాండం ద్వారా సుప్రీంకోర్టులో సవాలు చేసిందని కాంగ్రెస్ ఎంపీ నీరజ్ డాంగి చెప్పడంతో మళ్లీ రచ్చ మొదలైంది.

ఎస్పీ ఎంపీ జావేద్‌‌ అలీఖాన్‌‌ ప్రవేశపెట్టిన ప్రైవేట్‌‌ బిల్లుపై చర్చ సందర్భంగా డాంగి ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై మధ్యాహ్నం 3 వరకు చర్చ, వాగ్వాదం నడిచింది. దీంతో మరోసారి గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా పడింది.

లోక్​సభలోనూ సేమ్ సీన్.. 

శుక్రవారం లోక్​సభలోనూ పలు అంశాలపై గందరగోళం నెలకొనడంతో సభ కొద్దిసేపు వాయిదాపడింది. బెంగాల్​ను విభజించాలని, కర్నాటక మంత్రికి సంబంధించిన వాల్మీకీ కుంభకోణం అంశాన్ని లేవనెత్తేందుకు అపొజిషన్ సభ్యులు ప్రయత్నించారు. అందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమంతించకపోవడంతో ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు.