హైడ్రాకు రూ.25 లక్షలు .. ఎంపీ లాడ్స్ నుంచి అందజేసిన అనిల్ కుమార్ యాదవ్

హైడ్రాకు రూ.25 లక్షలు .. ఎంపీ లాడ్స్ నుంచి అందజేసిన అనిల్ కుమార్ యాదవ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ హైడ్రాకు తన ఎంపీ లాడ్స్ నుంచి రూ.25 లక్షలు కేటాయించారు. దీనికి సంబంధించిన లేఖను గురువారం బుద్ధభవన్​లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసి అందజేశారు. తర్వాత అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్ సిటీలోని చెరువులు కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేసి కమిషనర్ గా రంగనాథ్ ను నియమించారు. హైడ్రా పని తీరు బాగుంది. అందుకే నా ఎంపీ లాడ్స్ నుంచి రూ.25 లక్షలు అందజేసిన. 

పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. హైదరాబాద్​ను అభివృద్ధిలో వెనక్కి తీసుకెళ్లారు. ఒక్క చెరువు కూడా కాపాడలేదు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం భవిష్యత్ తరాల గురించి ఆలోచించారు. రాజకీయాల కోసం హైడ్రా తీసుకొచ్చారని కొందరు విమర్శిస్తున్నరు. హైదరాబాద్ అభివృద్ధి కోసమే హైడ్రా వచ్చిందన్న విషయం వాళ్లు గుర్తు పెట్టుకోవాలి’’ అని అనిల్ కుమార్ చెప్పారు. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో నీటి కొరత ఏర్పడుతున్నదని, అలాంటి ఇబ్బందులు ఇక్కడ రావొద్దని హైడ్రా తీసుకొచ్చారన్నారు. ‘‘పదేండ్ల కింద చాలా చెరువులు నిండు కుండలా ఉండేవి. ఇప్పుడు అవన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. భూములు కబ్జా చేసిన వాళ్లు ఏ స్థాయిలో ఉన్నా.. హైడ్రా వదిలిపెట్టదు’’ అని అనిల్ కుమార్ అన్నారు.