మూసీ ప్రక్షాళనపై కాదు.. రైతుల కష్టాలపై దృష్టి పెట్టాలి : రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌‌‌‌

మూసీ ప్రక్షాళనపై కాదు.. రైతుల కష్టాలపై దృష్టి పెట్టాలి : రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌‌‌‌
  • బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌‌‌‌

చౌటుప్పల్‌‌‌‌, వెలుగు : సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మూసీ ప్రక్షాళన కంటే ముందు రైతుల కష్టాలపైన దృష్టి పెట్టాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌‌‌‌ సూచించారు. వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మక్కై రైతుల పొట్ట కొడుతున్నారన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌లోని అగ్రికల్చర్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ యార్డు, జైకేసారంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన పరిశీలించారు. చౌటుప్పల్‌‌‌‌ మండలం చిన్నకొండూరుకు చెందిన పుల్లారెడ్డి వద్దకు వెళ్లి మాట్లాడాడు. తాను నెల రోజుల నుంచి ధాన్యం ఆరబోసినా ఆఫీసర్లు కొనడం లేదని రైతు కన్నీటి పర్యంతం కావడంతో పీఏసీఎస్‌‌‌‌ ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుల్లారెడ్డికి చెందిన వడ్లను కొనే వరకు తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని పట్టుబట్టడంతో ఆఫీసర్లు పుల్లారెడ్డి వడ్లను తూకం వేశారు. అనంతరం లక్ష్మణ్‌‌‌‌ మీడియాతో మాట్లాడుతూ రైతులు నెల రోజులకు వేచి ఉన్నా వడ్లు కొనకపోవడం దారుణం అన్నారు. సీఎం రైతుల కష్టాలను వదిలి మూసీ ప్రక్షాళనపై దృష్టి పెట్టారన్నారు. మూసీ ప్రక్షాళనకు తామేమీ వ్యతిరేకం కాదని, కానీ ముందు రైతుల కష్టాలు తీర్చాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఎన్నికల సమయంలో రైతు ప్రభుత్వమని చెప్పి.. ఇప్పుడు నిండా ముంచుతున్నారని మండిపడ్డారు.

ధాన్యం కొనుగోలుకు సంబందించి ప్రతి పైసా కేంద్రమే ఇస్తున్నా కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదన్నారు. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డికి రైతులపై ప్రేమ ఉంటే కొనుగోలు కేంద్రాల్లో పర్యటించాలని సవాల్‌‌‌‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌‌‌‌రెడ్డి, కిసాన్‌‌‌‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌‌‌‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌, బండారు ప్రసాద్, గుండగోని భరత్‌‌‌‌గౌడ్‌‌‌‌, దోనూరు వీరారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పడమటి జగన్మోహన్‌‌‌‌రెడ్డి, కిసాన్‌‌‌‌ మోర్చా యాదాద్రి జిల్లా అధ్యక్షుడు ఫకీరు రాజేందర్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.