కాళేశ్వరం వండర్ కాదు.. బ్లండర్

యాదాద్రి/హనుమకొండ, వెలుగు : కేసీఆర్ సర్కార్ అవినీతిలో దేశంలోనే నెంబర్ ​వన్​ స్థానంలో ఉందని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. అవినీతి సొమ్మునే ఎన్నికల్లో పెట్టుబడిగా పెడుతున్నారని అన్నారు. శుక్రవారం యాదాద్రి జిల్లా బీబీనగర్​మండలం గూడూరులో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ వండర్ కాదు.. అదో పెద్ద బ్లండర్ అని తేలిపోయింది. ఈ ప్రాజెక్టు కేసీఆర్​కు ఆదాయం సమకూర్చే ఫ్యాక్టరీగా మారింది. కేసీఆర్ పాపాలను భరించలేక గోదావరి మాత కాళేశ్వరం ప్రాజెక్టును ముంచి, కేసీఆర్​ అవినీతిని బట్టబయలు చేసింది. ప్రపంచం ముందు సీఎంను దోషిగా నిలబెట్టింది. ఈ ప్రాజెక్టు వల్ల రూ.80 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది” అని ఆయన అన్నారు. కాళేశ్వరం గురించి ఇప్పుడు సుద్దులు చెబుతున్న హరీశ్​రావు.. నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే నిధులు సమకూర్చుకున్నారని, ఆయనకు కాజేశ్వరరావు అని పేరు పెట్టాలని విమర్శించారు.  

కేసీఆర్ కుటుంబం, ప్రజలకు మధ్యే మునుగోడు
మునుగోడు ఉప ఎన్నిక ద్వారా అవినీతి, కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు లక్ష్మణ్​పిలుపునిచ్చారు. ఇది కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే ఎన్నిక అన్నారు. ‘‘కాంగ్రెస్, టీఆర్ఎస్​ ఒక్కటే. ఈ నిజం తెలుసుకొని రాజగోపాల్​ కాంగ్రెస్​కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారు. తెలంగాణ  ప్రజలకు భరోసా  ఇవ్వడానికి అమిత్ షా వస్తున్నారు. ఆయన సభను విజయవంతం చేయాలి” అని పిలుపునిచ్చారు. 

భద్రకాళి ఆలయంలో పూజలు..  
వరంగల్ భద్రకాళి అమ్మవారిని లక్ష్మణ్ దర్శించుకున్నారు. అనంతరం  మీడియాతో మాట్లాడారు. ‘‘అమ్మవారి దయవల్లే రాజ్యసభ సభ్యుడిగా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా, ఎలక్షన్ కమిటీ మెంబర్​గా అవకాశం దక్కిందన్నారు. ప్రజలు డబుల్​ఇంజన్​ సర్కారు కోరుకుంటున్నారన్నారు.