
- తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు
- పదేండ్లు అధికారంలో ఉన్న పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు
- రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వ్యాఖ్య
నల్గొండ అర్బన్, వెలుగు : రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ చెప్పారు. నల్గొండలోని బీజేపీ ఆఫీస్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఆయన పని అయిపోయిందని, ఇప్పుడు ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు అర్థమైందన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు క్యాండిడేట్లే కరువయ్యారని, కాంగ్రెస్ తమ క్యాండిడేట్లను అరువు తెచ్చుకుందని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్సీఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్లను గెలిపిస్తే ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అవుతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని, హామీలు అమలు చేయలేక అభాసుపాలవుతోందన్నారు. ఆరు గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటివరకు అర గ్యారంటీని కూడా అమలుచేయలేకపోయిందన్నారు. 2023 జులై 1 నుంచి అమలు కావాల్సిన కొత్త పీఆర్సీ ఎటు పోయిందని ప్రశ్నించారు.
ఉద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు బెనిఫిట్స్‌ను కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. సమావేశంలో నాయకులు పులి సర్వోత్తమ్‌రెడ్డి, నాగం వర్షిత్‌రెడ్డి, సైదిరెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, శ్రీదేవిరెడ్డి, పిల్లి రామరాజుయాదవ్, సునీత, శ్రీలతారెడ్డి పాల్గొన్నారు.