
- రాజ్యసభ సభ్యుడు విల్సన్
బషీర్బాగ్, వెలుగు: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనను రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చితే.. అమలుకు ఎలాంటి అడ్డంకులు ఉండవని సుప్రీంకోర్టు న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు విల్సన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయానికి 42% బీసీ రిజర్వేషన్లు దిక్సూచి’ అనే అంశంపై శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సదస్సు జరిగింది.
బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు అధ్యక్షత వహించారు. ఎంపీ విల్సన్, ఆల్ ఇండియా ఓబీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, మాజీ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్, ప్రముఖ డాక్టర్ పుంజాల వినయ్ కుమార్, ఓబీసీ లాయర్స్ జేఏసీ చైర్మన్ రాజు, దేవరాజు పాల్గొని మాట్లాడారు. 1994 నుంచి తమిళనాడులో బీసీలకు 50 శాతం, ఎస్సీలకు 18, ఎస్టీలకు ఒక శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని విల్సన్చెప్పారు.
రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లోచేర్చడంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. పెరియార్, అన్నాదురై, కరుణానిధి వంటి నేతలు రిజర్వేషన్ల కోసం రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు చేశారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఒకటైనందునే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. లేకపోతే దక్షిణ ప్రజలు నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ ఉద్యమకారులు, రాజకీయ పార్టీల్లోని బీసీ నేతలందరూ ఏకమై పోరాటాలు చేయాలని చిరంజీవులు పిలుపునిచ్చారు. సంఘాల మధ్య నేతల మధ్య మనస్పర్థలు వీడి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.