బీపీ మండల్కు భారత రత్న ఇవ్వాలి.. కేంద్రానికి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి

బీపీ మండల్కు భారత రత్న ఇవ్వాలి.. కేంద్రానికి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి

బషీర్​బాగ్, వెలుగు: మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీల ఆశాజ్యోతి బీపీ మండల్ కు భారతరత్న ఇచ్చి గౌరవించాలని విన్నవించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో యాదవ రాజ్యాధికార సమితి, బీసీ ఐక్యవేదిక సంయుక్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి బిందేశ్వర్ మండల్ అవార్డులను ప్రదానం చేశారు.  ఈ సందర్బంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. 

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గురుకుల పాఠశాలలను నిర్మించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ మండల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టి బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడం అభినందనీయమన్నారు. జాతీయ స్థాయిలో కూడా కులగణన చేపట్టాలని బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలన్నారు. 

అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలు ముఖ్యంగా యాదవ కులస్తులు రాజకీయంగా రాణించేందుకు త్వరలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్, బీమా రాంచందర్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్, యాదవ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బడుగుల నాగార్జున యాదవ్, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రాంచందర్ యాదవ్ పాల్గొన్నారు.