- తెలంగాణ వ్యాప్తంగా బీసీబంధు అమలు చేయాలి
బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంధు అమలు చేయాలని, ప్రతి బీసీ కుటుంబానికి రూ.15లక్షలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు బకాయిలను చెల్లించాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో బీసీ కార్పొరేషన్ ను రబ్బర్ స్టాంప్ గా మార్చారని, లక్షల్లో అప్లికేషన్లు తీసుకొని, ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వకుండా బీసీలను పిచ్చోళ్లను చేశారని మండిపడ్డారు.
గురువారం హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణ , కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 6 , 7తేదీల్లో ఢిల్లీలో ఓబీసీ జాతీయ సెమినార్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొంటారన్నారు.
అనంతరం ‘హలో బీసీ.. చలో ఢిల్లీ’ వాల్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా చెరుకుల సుగుణవతిని నియమిస్తూ కృష్ణయ్య నియామక పత్రాన్ని అందజేశారు. బీసీ నేతలు నీల వెంకటేశ్, వేముల రామకృష్ణ, సుధాకర్, రఘుపతి, అనంతయ్య, మట్ట జయంతి గౌడ్, సి.రాజేందర్, జోషి రాఘవ, ఈశ్వరప్ప, మణికంఠ, రాజు, రవి, శివమ్మ, వేణు, శివ తదితరులు పాల్గొన్నారు.